Sita Devi : కర్మ అంత పవర్‌ఫుల్‌నా? సీతాదేవిని కూడా వదలలేదా?

Sita Devi : మహా తల్లి సీతాదేవి చిన్నతనంలో జరిగిన ఒక ఆసక్తికరమైన వృత్తాంతం, కర్మ సిద్ధాంతం ఎంతటి శక్తిమంతమైనదో మనకు తెలియజేస్తుంది

Sita Devi

ఈ అనంత విశ్వంలో కర్మ అనేది ఒక అదృశ్య చక్రం వంటిది. మనం చేసే పనులు బూమరాంగ్‌లా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సత్యం సాక్షాత్తూ ఆ జగన్మాత జానకీదేవి జీవితంలోనే రుజువైంది. సకల ఐశ్వర్యాలకూ అధిదేవతగా కొలిచే లక్ష్మీదేవి అవతారమే సీతాదేవి.

అలాంటి మహాతల్లి కూడా గర్భవతిగా ఉన్న సమయంలో తన ప్రాణనాథుడైన శ్రీరామునికి దూరమై, అడవుల్లో అనంత వేదనను అనుభవించాల్సి వచ్చింది. దీని వెనుక పద్మపురాణంలో వివరించబడిన ఒక హృదయాలను ద్రవింపచేసే వృత్తాంతం దాగి ఉంది. కర్మఫలం ఎంతటి అమోఘమైనదో మనకు ఆ పురాణ గాథ తెలియజేస్తుంది.

మిథిలా నగర రాజకుమారిగా సీతాదేవి(Sita Devi) శైశవదశలో ఉన్నప్పుడు..జనక మహారాజు అంతఃపురంలోని తోటలో స్నేహితురాళ్లతో కలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉండేది.

అలా ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమం వైపు నుంచి ఎగురుకుంటూ వచ్చిన ఒక అందమైన రామ చిలుకల జంట .. అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మపై వాలాయి. ఆ పక్షులు మనుషుల భాషలోనే భవిష్యత్తులో జరగబోయే రామకథను మధురంగా గానం చేయసాగాయి.

అయోధ్య రాజవంశానికి చెందిన శ్రీరామచంద్రుడు అనే ధర్మాత్ముడు మిథిలా నగరానికి వచ్చి, జనకుని కుమార్తె అయిన సీతమ్మను పెళ్లాడతాడనేది ఆ గీతం సారాంశం.

అందులో తన పేరు వినపడటంతో ఆశ్చర్యపోయిన చిన్నారి సీతాదేవి(Sita Devi), ఆ పక్షులను ఎంతో ఆప్యాయంగా తన దగ్గరకు రప్పించుకుంది. ఆ చిలకల నోట రాముని రూపలావణ్యాలు, గుణ విశేషాల గురించి విన్న తర్వాత, ఆమె మనసులో ఆ శ్రీరాముడిపై అనురాగం చిగురించింది. దీంతో తన వివాహం జరిగేంత వరకు ఆ పక్షులు తనతోనే ఉండాలని కోరుకుంది.

అయితే, ఆ చిలకలు తాము స్వేచ్ఛగా విహరించే ప్రాణులమని, తమను బంధిస్తే బతకలేమని విలపిస్తూ చెప్పాయి. ఆ జంటలోని ఆడ పక్షి తాను గర్భంతో ఉన్నానని, ఈ సమయంలో తన భర్తకు దూరం చేయవద్దని వేడుకుంది.

కానీ, సీతమ్మ తెలిసీ తెలియనితనం వల్ల ఆ మగ పక్షిని వదిలిపెట్టి, గర్భవతియైన ఆడ పక్షిని మాత్రం పంజరంలో బంధించి ఉంచింది. తన ప్రాణసఖుడికి దూరమైన ఆ ఆడ పక్షి బాధను తట్టుకోలేక కొన్ని రోజులకే పంజరంలోనే ప్రాణాలు విడిచింది.

కానీ,చనిపోయే ముందు..గర్భవతినైన తనను తన భర్త నుంచి వేరు చేసి ఇంతటి శోకాన్ని మిగిల్చింది కాబట్టి, సీతమ్మ కూడా గర్భవతిగా ఉన్నప్పుడే భర్తకు దూరమై అడవుల పాలు అవుతుందని సీతకు శాపమిచ్చింది.

దీని తర్వాత భార్య మరణాన్ని చూసి తట్టుకోలేని మగ పక్షి నదిలో దూకి ప్రాణాలు వదులుతూ, వచ్చే జన్మలో రాముడి రాజ్యంలోనే పుట్టి ఆ ఇద్దరి ఎడబాటుకు మూలకారణం అవుతానంటూ చనిపోయింది.

Sita Devi

ఆ మరుజన్మలో ఆ మగ పక్షి అయోధ్యలో ఒక సామాన్య రజకుడిగా జన్మించింది. లంక నుంచి వచ్చిన సీతమ్మ పవిత్రతపై సమాజం ముందు నిందలు వేయడంతోనే..శ్రీరామచంద్రుడు గర్భవతిగా ఉన్న జానకీదేవిని అడవులకు పంపించాడు.

అలా చిన్నతనంలో తెలీక చేసిన ఒక చిన్న పొరపాటు, సీతమ్మ(Sita Devi) జీవితంలో అంతటి వియోగ దుఃఖానికి దారితీసింది.

ఈ కథ ద్వారా పురాణాలు మనకు బోధించే పరమార్థం ఒక్కటే. ఈ సృష్టిలో కర్మ నియమానికి ఎవరూ అతీతులు కారని.. అవతార పురుషులైనా సరే తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించక తప్పదని తెలుసుకోవాలి.

నువ్వుల మ్యాజిక్.. రోజూ ఇలా తింటే ఎముకలు ఇనుములా మారతాయట

జస్ట్ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version