Sri Rama Navami:శ్రీరామ నవమి ప్రత్యేకం.. నవమి రోజు పాటించాల్సిన నియమాలు తెలుసా?

Sri Rama Navami: బాలకాండలోని శ్రీరామ జననం ఘట్టాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తే సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని నమ్మకం.

Sri Rama Navami

మన హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని అంతం చేయడం కోసం సాక్షాత్తూ ఆ మహావిష్ణువు..శ్రీ రాముడిగా అవతరించిన పవిత్ర దినం అది. చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తాన రామయ్య జన్మించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ రోజు భక్తులు చేసే పూజలు, జపాలు విశేషమైన ఫలితాలనిస్తాయి. కేవలం పానకం, వడపప్పు సేవించడమే కాకుండా.. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ రోజంతా రామ నామ స్మరణలో గడపాలని పండితులు చెబుతారు. అలాగే కొన్ని పనులు చేస్తే ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయని వివరిస్తున్నారు.

శ్రీరామ నవమి (Sri Rama Navami)రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని పవిత్ర స్నానాలు ఆచరించాలి. ఆ సమయంలో మనసులో శ్రీ సీతారామ చంద్రమూర్తుల అనుగ్రహం తమ కుటుంబంపై ఉండాలని ఎవరికి వారు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి.

అనంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుల ఫోటోల విగ్రహాలను పసుపు, కుంకుమ , సుగంధ భరితమైన పూలతో అలంకరించుకోవాలి. నేతి దీపాన్ని వెలిగించి మనసారా రామయ్యను ధ్యానించాలి.

ఈ పవిత్ర దినాన రామాయణ పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బాలకాండలోని శ్రీరామ జననం ఘట్టాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తే సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

సమయం ఉన్నవారు శ్రీరామ రక్షా స్తోత్రం అయినా వీలు కాదు అంటే కనీసం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. వీలైతే ఆ రోజంతా ఉపవాసం ఉండటం లేదా పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసంతా ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందట.

Sri Rama Navami

అంతేకాదు శ్రీరామ నవమి(Sri Rama Navami) రోజు మధ్యాహ్న సమయంలో, అంటే రామయ్య జన్మించిన సమయంలో.. దేవాలయాల్లో జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడటం, ఒకవేళ వీలయితే ఇంట్లోనే యథాశక్తి కళ్యాణోత్సవం నిర్వహించడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

ఇక నైవేద్యం విషయానికి వస్తే, శ్రీరామ నవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పానకం, వడపప్పు , చలిమిడి. ఈ పదార్థాలను స్వామివారికి నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం వెనుక వేసవి తాపాన్ని తగ్గించగల ఆరోగ్య రహస్యం కూడా ఉంది.

అలాగే సాయంత్రం వేళల్లో శ్రీరామ భజనల కార్యక్రమం చేయడంతో పాటు రామ నామాన్ని స్మరించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందట. ఇక పురాణాల ప్రకారం ఈ నియమాలన్నిటినీ పాటించే వారికి శ్రీరామ కటాక్షం లభిస్తుంది. అలాగే కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు.

Sri Rama Navami : శ్రీరామ నవమి విశిష్టత…ఇలా చేస్తే ఇంట్లో సిరిసంపదలే

Exit mobile version