Ugadi
చైత్ర మాసపు తొలి రోజు.. చెట్లు చిగుర్చి, ప్రకృతి అంతా కొత్త పెళ్లికూతురులా ముస్తాబయ్యే సమయం కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది(Ugadi) అంటే తెలుగువారికి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది జీవిత ప్రయాణానికి ఒక దిక్సూచిగా భావిస్తారు.
ఉగ అంటే వయస్సు, ఆది అంటే మొదలు.. అంటే కాలానికి ఆరంభమని అర్థం. ఈ రోజు నుంచే బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించినట్లు మన పురాణాలు చెబుతాయి. అందుకే ఉగాది రోజు మన జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులను మొదలుపెట్టడానికి ఎంతో మంచిదిగా చెబుతారు.
ఉగాది(Ugadi) అనగానే అందరికి మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. వేపపూవు చేదు, కొత్త బెల్లం తీపి, పచ్చి మిరపకాయ కారం, ఉప్పు, మామిడి ముక్కల వగరు, చింతపండు పులుపు.. ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇది కేవలం ఒక ఉగాది రోజు ప్రసాదం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ప్రతీ ఒక్కరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది.
అంటే తీపి వంటి సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు అని.. చేదు వంటి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. జీవితం అంటే అన్ని భావోద్వేగాల కలయికేనని చెప్పడమే ఈ ఉగాది పచ్చడిలో వేసిన రుచులకు ఉన్న అసలు రహస్యం.
ఈ పండుగలో మరో ముఖ్యమైన ఘట్టం పంచాంగ శ్రవణం అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అంటే ఈ సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయనే విషయాలతో పాటు రాజపూజ్యం, అవమానం వంటి విషయాలను పండితులను అడిగి మరీ తెలుసుకుంటాం.
ఇది వారి భవిష్యత్తు గురించి వారిలో ఒక అవగాహన కల్పించడమే కాకుండా, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని మానసికంగా సిద్ధం చేసుకోవడానికి పనికి వస్తుంది. అలాగే ఈ రోజు ఇంటి గుమ్మానికి కట్టే మామిడి, వేప ఆకుల తోరణాలు, ఇంటి ముందు వేసే ముగ్గులు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. అంతేకాదు ఈరోజు కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ అక్షరాల ద్వారా వసంతాన్ని ఆహ్వానించడం మన తెలుగు వారి ప్రత్యేకతగా నిలుస్తోంది.
అంతేకాదు ఉగాది పండుగ అంటే పాత జ్ఞాపకాలను వదిలేసి,మరింత కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ మనం మాత్రం స్థితప్రజ్ఞతతో ముందుకు వెళ్లాలని ఉగాది పండుగ మనకు బోధిస్తుంది.
