Vijayadashami : విజయదశమి విశిష్టత ఏంటి? దసరా పండుగ రోజు ఏం చేయాలి?

Vijayadashami : విజయ దశమి రోజు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి దుర్గమ్మకు పొంగలి లేదా కేసరి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Vijayadashami

శరన్నవరాత్రుల కోలాహలం, నవదుర్గమ్మల పూజలు, తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలకు ముగింపు పలుకుతూ అసలైన శక్తిని, విజయాన్ని అందించే మహా పండుగ వచ్చేసింది. రేపు విజయదశమి.. మనం తలపెట్టిన ప్రతీ పనిలోనూ విజయాన్ని సాధించడానికి వచ్చే పవర్ ఫుల్ రోజు ఇది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే ఈ పండుగ రోజు మనింట్లోనే కాదు..మన లైఫ్‌లోనూ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.

విజయదశమి(Vijayadashami) అంటే విజయాన్ని ఇచ్చే దశమి అని అర్థం. శ్రీరాముడు రావణుడిని వధించిన రోజుగా.. మహాకాళి మహిషాసురుడిని అంతమొందించిన రోజుగా మనందరం నమ్మే ఈ రోజు.. ఎంచుకున్న లక్ష్యంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా చివరికి గెలుపు మనదే అని చెప్పడానికి నిదర్శనం. అందుకే ఈరోజు అందరూ కొత్త పనులకు శ్రీకారం చుట్టడం, వాహనాలు , కొత్త ఆస్తులు కొనడం వంటివి చేస్తుంటారు.

దసరా రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. దసరా రోజు అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. దీపారాధన చేసి, మనసారా మీ మనసులో కోరికను బలంగా తలచుకుంటూ పూజ పూర్తి చేయాలి. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి.. దుర్గమ్మకు పొంగలి లేదా కేసరి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ పండుగ రోజు ఆయుధ పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ ఇంట్లో ఉన్న పనిముట్లు, ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ గ్యాడ్జెట్లు, వాహనాలను శుభ్రం చేసి కుంకుమ, పసుపు, పూలతో అలంకరించి పూజించాలి. అంటే మనం లైఫ్‌ను ప్రశాంతంగా జీవించడానికి, కష్టపడి సంపాదించడానికి సహకరించే ప్రతీ వస్తువుకు కూడా కృతజ్ఞతలు చెప్పే అద్భుతమైన సంప్రదాయం ఇది.

దసరా రోజు సాయంత్రం సమయంలో అందరూ కలిసి ఆలయానికి వెళ్లడం, ఊరిబయట ఉండే జమ్మి చెట్టు (శమీ వృక్షం) దగ్గరకు వెళ్లడం ఆచారం. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలన్నిటినీ జమ్మి చెట్టు మీద దాచిపెట్టడం వల్లే విజయంతో బయటపడ్డారని పురాణాలు చెబుతున్నాయి.అందుకే జమ్మి ఆకులను దశమి రోజు బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఒకరికొకరు ఈ ఆకులను ఇచ్చుకుంటారు. అలాగే ఈరోజు పాలపిట్టను చూస్తే ఆ ఏడాదంతా అన్నీ శుభాలే కలుగుతాయని నమ్మకం.

విజయదశమి(Vijayadashami) రోజు ఎవరితో కూడా అనవసరమైన గొడవలకు దిగడం, కోపగించుకోవడం చేయకూడదు. ఇంట్లో నెగిటివ్ ఆలోచనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవరినీ చిన్నచూపు చూడటం అలాగే అహంకారంతో ప్రవర్తించడం వంటివి చేయకూడదు. చెడుపై మంచి గెలిచిన ఈరోజు మనలో ఉన్న అహంకారాన్ని, చెడు అలవాట్లను కూడా దహనం చేయాలనేది దీనికి అర్థం.ఈ విజయదశమి రోజున మీ జీవితంలో కూడా ఒక కొత్త విజయాన్ని అందుకోవడానికి అడుగు వేయండి.

Marriage : మూవీల్లో చూపించేది వేరు పెళ్లయ్యాక సీన్ వేరు…బంధాన్ని సైలెంట్‌గా దెబ్బతీసే చిన్న తప్పులు చేయకండి..

↑
Exit mobile version