Sri Rama Navami:శ్రీరామ నవమి ఎప్పుడు? మార్చి 26నా లేక 27నా?

Sri Rama Navami: మార్చి 26, 2026 గురువారం రోజే నవమి తిథి ప్రారంభమవుతుంది. దీంతో కొందరు ఆ రోజే వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నారు.

Sri Rama Navami

భారతీయ సంస్కృతిలో శ్రీరామ నవమికి.. ఒక విశిష్టమైన స్థానం ఉంటుందన్న విషయం తెలిసిందే . ధర్మానికి నిలువుటద్దం, ఆదర్శ పురుషుడు అయిన ఆ శ్రీరామచంద్రుడు చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి రోజు జన్మించాడు. అందుకే ఏటా శ్రీరామ నవమి రోజు పల్లె నుంచి పట్టణం వరకు రామనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగిపోతాయి. అయితే, 2026 సంవత్సరంలో శ్రీరామ నవమి పండుగను ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో చాలా మందిలో గందరగోళం నెలకొంది.

అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం, మార్చి 26, 2026 గురువారం రోజే నవమి తిథి ప్రారంభమవుతుంది. దీంతో కొందరు ఆ రోజే వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నారు. అయితే, మన సంప్రదాయంలో ఉదయ తిథి అంటే సూర్యోదయ సమయానికి ఉన్న తిథికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు.

అలా మార్చి 27, శుక్రవారం రోజు ఉదయ తిథి నవమి కావడంతో చాలామంది పండితులు , ప్రముఖ ఆలయాల్లో ఆ రోజే శ్రీరామ నవమి(Sri Rama Navami) వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి, మార్చి 27, శుక్రవారం రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Sri Rama Navami

శ్రీరాముడు మధ్యాహ్న వేళ, పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీని ప్రకారం మార్చి 27న మధ్యాహ్నం 11:30 గంటల నుంచి 1:41 గంటల వరకు అభిజిత్ ముహూర్తంలో.. శ్రీరాముడి జయంతి, నవమి పూజలు నిర్వహించుకోవడం మంచిది. అయితే స్థానిక సిద్ధాంతులు, మీ ప్రాంతంలోని దేవాలయాల పంచాంగం ప్రకారం కూడా శ్రీరామనవమి(Sri Rama Navami) పూజా వేళల గురించి తెలుసుకోవడం మంచిది.

ఈ పవిత్రమైన రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, పవిత్ర స్నానమాచరించి, రామనామ జపం చేసే వారికి సకల శుభాలు కలుగుతాయని, ఆశించిన కార్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడటం, తలంబ్రాలు స్వీకరించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పెద్దలు చెబుతుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version