HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దశాబ్ధ కాలంగా రూ.600 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ముఖ్యంగా హెచ్‌సీఏ(HCA), విశాఖ సంస్థల మధ్య జరిగిన ఒప్పందంపై సీబీఐ సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి పలు కీలక వివరాలతో మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
స్పష్టత లేని వ్యవహారాలు, ఒప్పందాల్లో వెనుక తేదీలు వంటివి హెచ్‌సీఏ(HCA), విశాఖ మధ్య కుదిరిన సంస్ధాగత రాజీకి ఉదాహారణలుగా పేర్కొంది. ఉప్పల్ స్టేడియం డీల్ కాంగ్రెస్ ను వెంటాడే మరో భోపోర్స్ అంశంపైనా టీసీఏ స్పందించింది. అసలు హెచ్‌సీఏలో ఆర్థిక పారదర్శకత లోపం, పాలనా వైఫల్యం, అధికారిక రికార్డులు తారుమారు వంటివి చాలా సహజంగానే మారిపోయాయని, ఇవన్నీ తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయని గురువారెడ్డి చెప్పారు.
ఇది ఒకే ఒప్పందానికి పరిమితమైన విషయం కాదనీ, హెచ్‌సీఏ(HCA)లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లోపాలకు నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ, విశాఖ సంస్థల మధ్య ఒప్పందాన్ని లేవనెత్తారు. ఒప్పందం తేదీ అక్టోబర్ 16, 2004 కాగా మార్చి 2004 నుంచే చెల్లింపులు ప్రారంభమైనట్టు సమాచారం ఉందన్నారు.
అధికారికంగా ఒప్పందం కుదరకముందే రూ.2.32 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఒప్పందం ఖరారవక ముందే ఆ చెల్లింపులు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అంటే ముందే గోప్యంగా మరో ఒప్పందం జరిగిందా.. లేక దానిని ఉద్దేశపూర్వకంగా దాచారా అనేది చెప్పాలన్నారు.
ముఖ్యంగా స్టేడియం పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మారిన దశలో సరైన అనుమతులు, మీటింగ్ మినిట్స్, రికార్డులు ఎందుకు లేవని గురువారెడ్డి సూటిగా ప్రశ్నించారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేని స్టేడియం నిర్మాణం, డిజైన్ అనుమతులు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లోపాలు, కనోపీ స్కాంలో అవకతవకలు, పన్నుల ఎగవేతలు వంటి అంశాల్లో చాలా ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని టీసీఏ ఆరోపిస్తోంది.
వీటన్నింటి మీద సీబీఐ పూర్తి విచారణ జరిపాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏతో సమన్వయం అవసరమని బాంబే హైకోర్టు 2021లోనే స్పష్టంగా ఆదేశాలిచ్చినా హెచ్‌సీఏ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకూడదనీ, అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం టీసీఏ కట్టుబడి ఉందని గురువారెడ్డి చెప్పారు.
