IPL : ఆటలో అదరగొడతారా ?…అనామక ప్లేయర్స్ పై అందరి చూపు

IPL : దేశవాళీ క్రికెట్ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఐపీఎల్ మొదలైంది. గత 18 సీజన్లుగా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్ కు పరిచయమయ్యారు

IPL

దేశవాళీ క్రికెట్ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఐపీఎల్(IPL) మొదలైంది. గత 18 సీజన్లుగా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్ కు పరిచయమయ్యారు. చాలా మంది టీమిండియాకు కూడా ఎంపికయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట కొందరు అనామక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది.

మినీవేలంలో కొందరు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ పై కాసుల వర్షం కురిసింది. వారి టాలెంట్ కు గుర్తింపు కోట్ల రూపాయలతో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసాయి. అలా కోట్లు కొల్లగొట్టిన అన్ క్యాప్డ్ ప్లేయర్స్ లో నలుగురు ఈ సీజన్ లో ఎలా ఆడతారనే దానిపై ఆసక్తి నెలకొంది.

వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ పేస్ ఎక్స్ ప్రెస్ ఆకీబ్ నబీదార్.. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్ లో సంచలన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా అతని సొంతం. రంజీ ట్రోఫీ రెండు సీజన్లలోనే 100 వికెట్లకు పైగా తీసి రికార్డు సృష్టించాడు.

ఇటీవల జమ్మూ కశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ గెలుచుకోవడంలో ఆకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ లో 17 ఇన్నింగ్స్ లలోనే 60 వికెట్లతో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ ప్రదర్శనతో మినీవేలంలో ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోసం ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగానే ప్రయత్నించాయి.

చివరకు రూ. 8.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం ఆకీబ్ ప్రత్యేకత. దేశవాళీ క్రికెట్ లో 12 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఢిల్లీ జట్టు బౌలింగ్ కు ఈ జమ్మూ పేసర్ కీలకం కానున్నాడు.

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో వారి టాలెంట్ ను అంచనా వేసి భవిష్యత్తు దృష్ట్యా కోట్లు వెచ్చించేందుకు వెనుకాడదు. దీనిలో భాగంగానే యువ స్పిన్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ ను ఏకంగా రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రశాంత్ వీర్ ను రవీంద్ర జడేజా వారసుడిగా సీఎస్కే భావిస్తోంది. దేశవాళీ టీ20 కెరీర్ లో మంచి రికార్డు ఉండడం అతనికి భారీ ధర పలికేలా చేసింది. 170 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూనే బంతితోనూ సత్తా చాటగలడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉండడంతో భవిష్యత్తు కోసం అతన్ని సీఎస్కే తీసుకుందని చెప్పొచ్చు. ఈ సీజన్ లో చెపాక్ పిచ్ లపై ప్రశాంత్ వీర్ చెన్నైకి కీలకం కానున్నాడని అంచనా వేస్తున్నారు.

IPL

ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు దొరికిన మరో ఆణిముత్యం కార్తీక్ శర్మ.. 19 ఏళ్ల వికెట్ కీపింగ్ హిట్టర్ ను సీఎస్కే ఏకంగా రూ.14.2 కోట్లకు దక్కించుకుంది. ఇంత భారీ మొత్తం పెట్టడానికి కారణముంది. టాపార్డర్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతని సొంతం.

రంజీ సీజన్ లోనూ, విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. అతని సిక్స్ హిట్టింగ్ ఆకట్టుకోవడంతోనే సీఎస్కే భారీ ధరకు తీసుకుంది. పవర్ ప్లేలో కార్తీక్ శర్మను చెన్నై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఫినిషర్ గానూ వాడుకునే ఛాన్సుంది.

ఐపీఎల్ లో ఆర్సీబీ కొనుగోలు చేసిన టాలెంటెడ్ బౌలర్ మంగేశ్ యాదవ్… తన స్కౌట్ నెట్ వర్క్ ద్వారా మంగేష్ ను గుర్తించిన ఆర్సీబీ వేలంలో అతన్ని రూ.5.2 కోట్లకు దక్కించుకుంది. ట్రక్ డ్రైవర్ కొడుకైన మంగేశ్ మధ్యప్రదేశ్ టీ20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆరు మ్యాచ్ లలోనే 14 వికెట్లు తీసాడు. దేశవాళీ క్రికెట్ లోనూ మెరుగైన రికార్డు ఉన్న ఈ పేస్ బౌలర్ ను ఆర్సీబీ తమ పేస్ ఎటాక్ లో భాగం చేసుకుంది.

IPL Schedule : 12 వేదికలు..50 మ్యాచ్ లు…ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుదల

Exit mobile version