Chennai Super Kings : సంజూ ధనాధన్..చెన్నైకి మరో విజయం

Chennai Super Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసింది. ఆరంభంలో నిరాశపరిచిన సీఎస్కే ఇప్పుడు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది

Chennai Super Kings

ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పూర్తి ఫామ్ లోకి వచ్చేసింది. ఆరంభంలో నిరాశపరిచిన సీఎస్కే ఇప్పుడు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్ లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

వర్షం కురవడంతో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే ఆరంభంలో పిచ్ పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీనిని సద్వినియోగం చేసుకున్న చెన్నై బౌలర్లు వరుస వికెట్లతో ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. నిస్సాంక(19) , రాహుల్ (12),నితీశ్ రాణా(15), కరుణ్ నాయర్ (13), అక్షర్ పటేల్ (2) పరుగులకే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

కనీసం 120 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో స్టబ్స్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ధాటిగా ఆడిన వీరి జోడీ ఆరో వికెట్ కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించింది. 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన స్టబ్స్ ను ఓవర్టన్ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత అశుతోశ్ శర్మ 14 పరుగులకు ఔటవగా.. రిజ్వీ దూకుడు కొనసాగించాడు.

చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా..అకిల్ హొస్సేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్ నీత్ సింగ్, ఓవర్టన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆరంభంలో ఓవర్ కు ఆరు పరుగులే చేసినా కూడా చివర్లో దూకుడుగా ఆడిన ఢిల్లీ ఆరు ఓవర్లలోనే 78 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో ఢిల్లీ బౌలర్లు కాసేపు ప్రయత్నించినా చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. దూకుడుగా ఆడుతూ చెన్నై(Chennai Super Kings)కి జోష్ ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (6), ఉర్విల్ పటేల్ (17) పరుగులకే ఔటవగా.. చెన్నై 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజూ శాంసన్, కార్తీక్ శర్మ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిలబెట్టారు.

Chennai Super Kings

కొద్దిసేపు ఆచితూచి ఆడిన తర్వాత సంజూ గేర్ మార్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. స్టార్క్ , ఎంగిడీతో పాటు ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ ను ఉతికారేశాడు. వీరిద్దరూ 65 బంతుల్లోనే 110 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ సాధించిన సంజూ భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.

అటు కార్తీక్ శర్మ సైతం మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ మరో 15 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. సంజూ శాంసన్ 52 బంతుల్లో 87 (7 ఫోర్లు, 6 సిక్సర్లు) నాటౌట్, కార్తీక్ శర్మ 31 బంతుల్లో 41 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచారు. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది ఆరో ఓటమి. అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది ఐదో విజయం.

Vijay : ఆ పార్టీలతో కలిసేది లేదు..విజయ్ కీలక నిర్ణయం

Exit mobile version