CSK vs LSG
ఐపీఎల్ 19వ సీజన్ లో సెకండాఫ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చాయి. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు వరుస విజయాలతో అదరగొడుతోంది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడబోతోంది.
లక్నో దాదాపుగా ప్లే ఆఫ్ రేసుకు దూరమైనా సరే సాంకేతికంగా ఇంకా నిలిచే ఉంది. పైగా గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై అప్రమత్తంగా ఆడకుంటే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ప్రస్తుతం సీఎస్కే 10 మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. దీంతో లక్నోతో మ్యాచ్ కూడా ఆ జట్టుకు కీలకమే.
గత రెండు మ్యాచ్ లలో చెన్నై అదిరిపోయే ఆటతీరుతో ముంబై, ఢిల్లీ జట్లను ఓడించింది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండగా.. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ పై శతకంతో చెలరేగిన సంజూ తర్వాత ఢిల్లీపైనా 87 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కార్తీక్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు. గత రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నాడు.
బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, బ్రెవిస్ కూడా చెలరేగితే చెన్నైకి తిరుగుండదు. బౌలింగ్ లో ఓవర్టన్ సత్తా చాటుతున్నాడు. ముకుల్ చౌదరి, అన్షుల్ కాంబోజ్ తో పాటు స్పిన్నర్లు నూర్ అహ్మద్, అకిల్ హొస్సేన్ కూడా చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హోంగ్రౌండ్ లో ఆడుతుండడం కూడా సీఎస్కేకు కలిసొచ్చే అంశం.
మరోవైపు ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ గత మ్యాచ్ లో బెంగళూరుకు షాకిచ్చింది. మిఛెల్ మార్ష్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ మూడో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న లక్నో మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే.
మిగిలిన జట్లు ఫలితాలు కూడా కలిసి రావాలి. అయితే ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేసేందుకు లక్నోకు ఛాన్సుంది. మార్ష్ నిలకడగానే రాణిస్తున్నా పూరన్, పంత్ మాత్రం ఇంకా భారీ ఇన్నింగ్స్ లు ఆడలేదు. ఈ సీజన్ లో లక్నో ఓటమికి వారిద్దరి పేలవ బ్యాటింగే కారణం. కెప్టెన్ గానూ పంత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పైగా బ్యాటింగ్ ఆర్డర్ లో లక్నో చేస్తున్న అనవసర ప్రయోగాలు కూడా ఓటములకు కారణమవుతున్నాయి.
బౌలింగ్ లో షమీ , ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్ లో రాణిస్తున్నారు. స్పిన్నర్ దిగ్వేశ్ తో పాటు షాబాజ్ అహ్మద్ కూడా లక్నోకు ఇప్పుడు కీలకంగా మారాడు. గత రికార్డులను చూస్తే లక్నోదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఆరుసార్లు తలపడితే 3 మ్యాచ్ లలో లక్నో గెలిచింది. ఇక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి.
Roses:వేసవి తాపానికి గులాబీతో విరుగుడు..నేచురల్ థెరపీతో బెనిఫిట్స్
