Gambhir
భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లు అవుతోంది. 2011లో ధోనీ సారథిగా వరల్డ్ కప్ ను ముద్దాడిన టీమిండియా మళ్లీ దానిని అందుకోలేకపోయింది. 2023లో ఫైనల్ వరకూ చేరి టైటిల్ పై ఆశలు రేకెత్తించినా కంగారూల చేతిలో పరాజయం పాలవడం అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇప్పుడు 2027లో మెగాటోర్నీలో ఛాంపియన్ గా నిలవాలనే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. దీని కోసం బీసీసీఐ సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir) ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు ప్రారంభించామని సైకియా వెల్లడించారు.
ఈ మెగాటోర్నీకి ముందు టీమిండియా వీలైనన్ని ఎక్కువ వన్డేలు ఆడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఆటగాళ్లను పరీక్షించడంతో పాటు బలమైన జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లాండ్ టూర్ నుంచే మిషన్ వన్డే ప్రపంచకప్ మొదలవుతోందని బోర్డు వర్గాలు తెలిపాయి. గతంలో సెలక్టర్లు, కోచ్ గంభీర్(Gambhir) తో కొందరి ఎంపిక విషయంలో విభేదించారన్న ప్రచారం జరిగింది.
దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారని స్పష్టం చేసింది. సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని సైకియా తెలిపారు. కేవలం ప్రస్తుత ఫలితాలే కాకుండా 2027 వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకుని జట్టు ఎంపిక, తుది జట్టు కూర్పు వ్యూహాలు ఉండబోతున్నాయనేది అర్థమవుతోంది.
2023 వరల్డ్‌కప్ తర్వాత భారత వన్డే జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ , కోహ్లీ వచ్చే ప్రపంచకప్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిద్దరూ కచ్చితంగా జట్టులో ఉంటారా లేదా అనేది గంభీర్ హామీ ఇవ్వడం లేదు.
కాకుంటే మెగాటోర్నీ కోసం గంభీర్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా గంభీర్ వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశాడు. యువ ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ ఆటగాళ్లతో కలిపి జట్టును సిద్ధం చేయడం , దక్షిణాఫ్రికా పిచ్ , వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జట్టు కాంబినేషన్ ను సెట్ చేయడం, వీలైనన్ని ఎక్కువ వన్డేలు ఉండేలా చూడడం కీలకాంశాలుగా ఉన్నాయి.
ఎందుకంటే వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న సఫారీ పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఆ పిచ్ లపై ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడేలా బ్యాటర్లను తీర్చిదిద్దడం గంభీర్(Gambhir) కు ప్రధాన టాస్క్ గా చెప్పొచ్చు.
బౌలింగ్ లోనూ బుమ్రాతో పాటు అతనికి సపోర్ట్ గా పలువురు యువ పేసర్లను సిద్ధంగా ఉంచడం కూడా గంభీర్ ప్లాన్ లో మరో టాస్క్. మొత్తం మీద 2027 వన్డే ప్రపంచకప్ ను గెలవడమే లక్ష్యంగా గంభీర్ బ్లూ ప్రింట్ ఉండబోతోంది.
IPL : హార్దిక్ అటు… జైస్వాల్ ఇటు..ఐపీఎల్ లో మరో ట్రేడింగ్ డీల్
