Gujarat Titans
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంచలన విజయాలతో ఛాంపియన్ గా నిలిచింది. తర్వాతి సీజన్ లో సైతం ఫైనల్ కు దూసుకొచ్చి తృటిలో రెండో ట్రోఫీని చేజార్చుకుంది. ఓవరాల్ గా సుధీర్ఘ కాలం నుంచి లీగ్ లో ఉన్న జట్ల కంటే బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కథ హార్థిక్ పాండ్యా వెళ్లిన తర్వాత కాస్త మారినా తక్కువ సమయంలోనే మళ్లీ పుంజుకుంది.
శుభమన్ గిల్ సారథ్యంలో రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తున్న గుజరాత్ టైటాన్స్ పై ఈ సారి అంచనాలు బాగానే ఉన్నాయి. మినీ వేలంలో గుజరాత్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. తమ మ్యాచ్ విన్నర్లను కొనసాగిస్తూనే బెంచ్ ను పటిష్టం చేసుకుంది. గత సీజన్ జట్టునే కొనసాగించడం గుజరాత్ కు అడ్వాంటేజ్. వేలంలో ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, జాసన్ హోల్డర్ వంటి విదేశీ ప్లేయర్స్ తో పాటు తెలుగబ్బాయి పృథ్విరాజ్ యర్రాను కొనుగోలు చేసింది.
గత సీజన్ లోని ఎక్కువ మంది ఆటగాళ్లే కంటిన్యూ అవుతుండడంతో తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. గుజరాత్ బ్యాటింగ్ విభాగంలో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అత్యంత కీలకం. ఆ జట్టు భారీస్కోర్లకు ఈ ముగ్గురే కారణం. నిలకడగా రాణిస్తూ గుజరాత్(Gujarat Titans) బ్యాటింగ్ కు కీలకంగా ఉంటున్నారు. మంచి ఆరంభాలను ఇవ్వగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు వీళ్లు. గత సీజన్ లో సాయి సుదర్శన్ దుమ్మురేపాడు.
150కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 759 పరుగులు చేసిన సాయి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అలాగే గిల్ 650 , బట్లర్ 538 పరుగులు చేశారు. ఈ త్రయం చెలరేగితే గుజరాత్ కు తిరుగుండదు. అటు బౌలింగ్ లో రబాడ, ప్రసిద్ధ కృష్ణలతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ కు కీలకంగా చెప్పొచ్చు.
రబాడ పూర్తిస్థాయిలో చెలరేగితే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. అలాగే ప్రసిద్ధ కృష్ణ గత సీజన్ లో 25 వికెట్లు తీశాడు. సిరాజ్ కూడా సత్తా చాటితే ప్రత్యర్థి జట్లను కట్టడి చేయొచ్చు. వేలంలో కొత్తగా తీసుకున్న ల్యూక్ వుడ్ కూడా అడ్వాంటేజ్ కానున్నాడు.
మరోవైపు స్పిన్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తో పాటు సాయికిశోర్ లపై అంచనాలున్నాయి. అయితే గత సీజన్ లో రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం గుజరాత్ అవకాశాలను దెబ్బతీసింది. దీంతో ఈ సారి రషీద్ తన మ్యాజిక్ చూపిస్తాడని ఆశలు పెట్టుకుంది.
ఇదిలా ఉంటే మిడిలార్డర్ నిలకడలేమి గుజరాత్ టైటాన్స్ కు సమస్యగా మారింది. టాపార్డర్ రాణిస్తున్న మిడిలార్డర్ లో నమ్మకం పెట్టుకునే బ్యాటర్లు లేకపోవడంతో భారీస్కోర్లు సాధించడం కష్టమే. ఈ సారి గ్లెన్ ఫిలిప్స్ , బాంటన్ వంటి వారిని మిడిలార్డర్ లో ప్రయత్నించే అవకాశాలున్నాయి.
అలాగే ఫినిషర్ రోల్ ను తెవాటియా అనుకున్నస్థాయిలో పోషించలేకపోతుండడం కూడా సమస్యగా మారింది. హోల్డర్ ను తీసుకున్నప్పటికీ తుది జట్టులో అతన్ని తీసుకోవడం సవాలే. మొత్తం మీద టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పేరున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అంచనాలకు తగ్గట్టు రాణిస్తే మాత్రం రెండో టైటిల్ గెలవొచ్చు.
Rajasthan Royals : రూ.15 వేల కోట్లతో డీల్…చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్
