IND A vs AFG A
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో భారత యువ జట్టు ఫామ్ లోకి వచ్చింది. గత మ్యాచ్ లో శ్రీలంకపై సూపర్ ఓవర్ లో ఓడిపోయిన భారత్ ఏ(IND A vs AFG A) జట్టు కీలక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. 102 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుని ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తేనే ఫైనల్ బెర్త్ దక్కుతుందని తేలిపోవడంతో భారత్ యువ జట్టు దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన 50 ఓవర్లలో 9 వికెట్లకు 319 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 38 , రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులతో పర్వాలేదనిపించగా యువ క్రికెటర్లు ప్రియాన్ష్ ఆర్య, కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో రాణించారు.
బ్యాటర్లు సమిష్టిగా రాణించి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భారత్ భారీస్కోరు నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 42 బంతుల్లో 58 ( 9 ఫోర్లు, సిక్సర్) తిలక్ వర్మ 75 బంతుల్లో 59, కుమార్ కుశాగ్ర 67 బంతుల్లో 58 పరుగులు చేశారు. చివర్లో విప్రజ్ నిగమ్ 20 బంతుల్లో 4 ఫోర్లతో 30లతో దూకుడుగా ఆడాడు. ఆఫ్ఘన్-ఏ(IND A vs AFG A) బౌలర్లలో ఫరిదూన్, అబ్డుల్లా అహ్మద్‌జై , ఫర్మనుల్లా రెండేసి వికెట్లు తీయగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
తర్వాత ఛేజింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు చేతులెత్తేసింది. భారత ఏ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. నిశాంత్ సింధు 4 వికెట్లతో ఆఫ్ఘన్ ఏ జట్టు పతనాన్ని శాసించాడు. నిశాంత్ కేవలం 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. యష్ ఠాకూర్ తో పాటు మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు 36.5 ఓవర్లలో 218 రన్స్ కు ఆలౌటైంది.
ఆ జట్టులో బహీర్ షా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో బ్యాటర్ ఫైసల్ 46 పరుగులతో పర్వాలేదనిపించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ కు భారీ విజయం దక్కింది. కాగా ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ ఏ ఫైనల్లో అడుగుపెట్టింది. 4 మ్యాచ్ లలో 2 గెలిచిన భారత్ మెరుగైన రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది.
ఫలితంగా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. అటు శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్ తో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. రన్ రేట్ పరంగా శ్రీలంక మెరుగ్గా ఉండడంతో ఆ జట్టు తక్కువ మార్జిన్ తో ఓడినా ముందంజ వేస్తుంది.
Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు
