KKR : కోల్ కతా గెలిచిందోచ్..రింకూ అద్భుత పోరాటం

KKR : హమ్మయ్య ఎట్టకేలకు కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్ పై రింకూ సింగ్ అద్భుత పోరాటంతో తొలి విజయాన్ని అందుకుంది

KKR

హమ్మయ్య ఎట్టకేలకు కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్ పై రింకూ సింగ్ అద్భుత పోరాటంతో తొలి విజయాన్ని అందుకుంది. లక్ష్యం భారీగా లేకున్నా మరోసారి కోల్ కతా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరికి రింకూ, అనుకుల్ రాయ్ పోరాటంతో ఆఖరి ఓవర్లో గట్టెక్కింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే ఓపెనర్లు జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వైభవ్ తన దూకుడు కొనసాగిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అటు జైస్వాల్ కూడా ధాటిగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. కానీ వైభవ్ 28 బంతుల్లో 46 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కాసేపటికే జురెల్ (5), జైస్వాల్ (39) పరుగులకు ఔటయ్యారు.

ఇక్కడ నుంచీ రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ , హెట్ మెయిర్, ఫెరీరా, జడేజా త్వరత్వరగా ఔటయ్యారు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది. కోల్ కతా బౌలర్లు ఈ సీజన్ లో తొలిసారి అద్భుతందా బౌలింగ్ చేశారు. కార్తీక్ త్యాగీ 3 , వరుణ్ చక్రవర్తి 3 , సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు.

స్పిన్ పిచ్ కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఛేజింగ్ అంత సాఫీగా సాగలేదు. తొలి బంతికే సీఫెర్ట్ డకౌటవగా…. పవర్ ప్లేలోనే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. రహానే (0) డకౌటవగా కామెరూన్ గ్రీన్ 13 బంతుల్లో 27 (4 ఫోర్లు, 1 సిక్సర్ ) ధాటిగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. రఘువంశీ (10) , పావెల్ (23), రమణ్ దీప్ సింగ్ (10) కూడా ఔటవడంతో కోల్ కతా మ్యాచ్ గెలవడం కష్టంగానే కనిపించింది. ఫామ్ లో లేని రింకూసింగ్, టెయిలెండర్ అనుకుల్ రాయ్ అద్భుతం చేశారు.

KKR

వీరోచిత పోరాటంతో మ్యాచ్ ను ఉత్కంఠ భరితంగా మార్చేశారు. వీరిద్దరూ 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. నిజానికి రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్ ను ఫెరీరా జారవిడవడం మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. రాజస్థాన్ స్పిన్నర్లు జడేజా, రవి బిష్ణోయ్ కీలక వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది.

చివరి 2 ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ భారీ షాట్లతో కోల్ కతాను గెలిపించాడు. చాలారోజుల తర్వాత రింకూ సింగ్ తనదైన బ్యాటింగ్ తో అలరించాడు. రింకూ సింగ్ 34 బంతుల్లో 53 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్, అనుకుల్ రాయ్ 16 బంతుల్లో 29 (1 ఫోర్ , 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచారు. దీంతో సీజన్ తొలి విజయాన్ని అందుకున్న కోల్ కతా(KKR) పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది.

Deepika Padukone:దీప్-వీర్ గుడ్ న్యూస్..దువా పోస్ట్‌తో ఆ రూమర్లకు చెక్

Exit mobile version