Kolkata
క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలు మజా.. ఆదివారం లక్నో, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు గెలుపుపై ఆశలు లేని ఇరు జట్ల మధ్య జరిగిన ఈ పోరు సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈజీగా గెలిచే మ్యాచ్ లో త్యాగి వేసిన రెండు నోబాల్స్ కేకేఆర్ కొంపముంచితే… ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టై చేసిన షమీ పోరాటం వృథా అయింది. సూపర్ ఓవర్ లో లక్నో ఓడిపోయింది.
మొత్తం మీద సూపర్ సండే రోజున ఐపీఎల్ అభిమానులకు సూపర్ వినోదం దక్కింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ విజయంతో ఉత్సాహంగా బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా (Kolkata)కు లక్నో పేసర్ మోసిన్ ఖాన్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. టాపార్డర్ ను కుప్పకూల్చాడు. రహానే (10), పావెల్ (1), సిఫర్ట్ (0) , రఘువంశీ (అబ్ స్ట్రక్టింగ్ ఫీల్డ్ ) ఔటయ్యారు.
ఫలితంగా కేకేఆర్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేకేఆర్‌ను రింకూ అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓ దశలో ఆచితూచి ఆడిన రింకూ.. చివరి రెండు ఓవర్లలో రెచ్చిపోయాడు. షమీ వేసిన 19వ ఓవర్‌లో 17 బాదిన రింకూ సింగ్.. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు సిక్స్‌లు బాది 26 పరుగులు రాబట్టాడు. దీంతో కోల్‌కతా(Kolkata) నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
చాలా రోజుల తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రింకూ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. మోసిన్ ఖాన్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది. మిఛెల్ మార్ష్ , పూరన్, ముకుల్ చౌదరి నిరాశపరిచారు. అయితే రిషబ్ పంత్, మార్క్ రమ్ ఆదుకోవడంతో లక్నో గెలిచేలా కనిపించింది.
వీరిద్దరూ కీలక సమయంలో ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో ఆయుశ్ బదోనీ (24) హిమ్మత్ సింగ్ (19) పరుగులు చేసి ఔటవడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో కేకేఆర్ పేసర్ త్యాగీ రెండు నోబాల్స్ వేసి కొంపముంచాడు. చివరి బంతికి షమీ సిక్సర్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ తప్పలేదు.
సూపర్ ఓవర్లో తొలి బంతికే సునీల్ నరైన్ అద్భుతమైన బంతితో పూరన్ ను బౌల్డ్ చేశాడు. తర్వాత పంత్ సింగిల్ తీయగా.. మూడో బంతికి మార్క రమ్ ఔటవడంతో లక్నో ఇన్నింగ్స్ 1 పరుగుకే ముగిసింది. అనంతరం రింకూ సింగ్ ఫోర్ కొట్టి కోల్‌కతా(Kolkata)ను గెలిపించాడు. ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఇది రెండో విజయం.
