RCB
ఐపీఎల్ 2026 సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ(RCB) ఘనంగా మొదలుపెట్టింది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. భారీస్కోరు చేసినా బౌలింగ్ బలహీనంగా ఉండడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూసింది. ఆర్సీబీ (RCB) బ్యాటింగ్ లో పడిక్కల్ ,కోహ్లీ విధ్వంసం హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
గత ఏడాది చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట మృతులకు రెండు జట్లు నివాళులర్పించగా.. ఆర్సీబీ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. హ్యాజిల్ వుడ్ కు బ్యాకప్ బౌలర్ గా వచ్చిన జాకబ్ డఫీ సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు పడగొట్టాడు. వరుసగా ఓవర్లు వేసి తన స్పెల్ పూర్తి చేసుకున్న డఫీ హెడ్ (11), అభిషేక్ శర్మ(7), నితీశ్ కుమార్ రెడ్డి(1) లను పెవిలియన్ కు పంపాడు. దీంతో సన్ రైజర్స్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ తో కలిసి నాలుగో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అయితే క్లాసెన్ (31) వివాదాస్పద క్యాచ్ కు ఔటయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఫిల్ సాల్ట్ అద్భుతంగా బంతిని అందుకున్నా సరే రోప్ ను టచ్ చేసినట్టు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ గా ప్రకటించడంతో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. క్లాసెన్ కూడా అంపైర్ తో వాగ్వాదం చేశాడు.
ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి ఔటవగా.. ఇక్కడ నుంచి సన్ రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా అనికేత్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 43 (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ టీం 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది.
ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 , షెఫర్డ్ 3 , భువనేశ్వర్, అభినంద్ సింగ్ , సుయాశ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన ఫిల్ సాల్ట్ (8) ఔటయ్యాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ మొదలెట్టిన అతడు భారీ షాట్లతో చెలరేగిపోయాడు.
అటు కోహ్లీ కూడా గేర్ మార్చడంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే 76 పరుగులు చేసింది. పడిక్కల్, కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. వీరిద్దరూ రెండో వికెట్ కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో పడిక్కల్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పడిక్కల్ 61( 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్ కు ఔటైనా… కోహ్లీ, పటిదార్ దూకుడు కొనసాగించారు. కెప్టెన్ పటిదార్ దుమ్మురేపాడు. కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసాడు. చివర్లో పటిదార్, జితేశ్ శర్మ ఓకే ఓవర్లో ఔటైనా.. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. తన ఫామ్ కొనసాగించిన కోహ్లీ కేవలం 38 బంతుల్లో 69 (5 ఫోర్లు, 5 సిక్సర్లు) రన్స్ చేయగా.. టిమ్ డేవిడ్(10) నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో డేవిడ్ పైన్ 2, హర్ష్ దూబే, ఉనాద్కట్ ఒక్కో వికెట్ తీశారు.
