RCB vs DC : బెంగళూరుకు ఎదురుందా ?…ఢిల్లీ క్యాపిటల్స్ తో బిగ్ ఫైట్

RCB vs DC : ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోంగ్రౌండ్ లో మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది

RCB vs DC

ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోంగ్రౌండ్ లో మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది. శనివారం మధ్యాహ్నం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(RCB vs DC) తో తలపడబోతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచీ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే ఆర్సీబీ ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లలో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో తప్పిస్తే మిగిలిన జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

ప్రస్తుతం బెంగళూరు ఐదు మ్యాచ్ లలో నాలుగు విజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్(RCB vs DC) పై గెలిస్తే టాప్ ప్లేస్ కు దూసుకెళుతుంది. అదే సమయంలో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంటుంది. ఆర్సీబీ జట్టులో కీలక ఆటగాళ్ళందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ , కోహ్లీ ఓపెనింగ్ బెంగళూరుకు మరోసారి అడ్వాంటేజ్ గా మారింది.

గత సీజన్ లో ఆర్సీబీ(RCB vs DC) టైటిల్ గెలిచినప్పుడు వీరిచ్చిన ఆరంభాలే కీలకపాత్ర పోషించాయి. మరోసారి అదే ఫామ్ కొనసాగిస్తుండడంతో వరుస విజయాలు దక్కుతున్నాయి. గత మ్యాచ్ లో కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించడం, ఆరోగ్యం సరిగా లేకున్నా విరాట్ మాత్రం సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోవడం అభిమానులు చూసారు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ కోహ్లీ నుంచి కోరుకుంటున్నారు. అలాగే రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ లతో దుమ్మురేపుతున్నాడు.

పడిక్కల్, జితేశ్ శర్మలతో పాటు టిమ్ డేవిడ్ ఫినిషర్ రోల్ లో అదరగొట్టేస్తున్నాడు. రొమారియో షెఫర్డ్ కూడా చివర్లో హిట్టింగ్ చేస్తున్నాడు. అటు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్ వుడ్ ఫామ్ అందుకున్నారు. గత మ్యాచ్ లో భువనేశ్వర్ అదిరిపోయే స్పెల్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.

అటు యువ పేసర్ రసిక్ సలామ్ దార్ కూడా ఆకట్టుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఆర్సీబీకి ప్రధాన బలం. సుయాశ్ శర్మ మ్యాజిక్ కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ది భిన్నమైన పరిస్థితి. సీజన్ ను అద్భుతమైన విజయాలతో ఆరంభించిన ఢిల్లీ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతోంది. గత రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. బ్యాటింగ్ లో నిలకడలేమి, బౌలింగ్ లో సమిష్టితత్వం లేకపోవడం ఢిల్లీ ఓటములకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

RCB vs DC

ముఖ్యంగా కేఎల్ రాహుల్ వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇబ్బందిగా మారింది. గత సీజన్ లో పరుగుల వరద పారించిన రాహుల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అలాగే రెండు మ్యాచ్ లు గెలిపించిన సమీర్ రిజ్వీ తర్వాత గాడి తప్పాడు. దీంతో రిజ్వీ గాడినపడితే తప్ప ఢిల్లీకి భారీస్కోర్లు రావడం కష్టమే. అలాగే డేవిడ్ మిల్లర్, స్టబ్స్ తో పాటు అక్షర్ పటేల్ పై అంచనాలున్నాయి.

నిలకడ లేకపోవడమే ఇక్కడ ఢిల్లీకి ప్రధాన సమస్య. ఫ్లాట్ వికెట్ గా ఉండే చిన్నస్వామి స్టేడియంలో తమ బ్యాటర్లు చెలరేగుతారని ఢిల్లీ భావిస్తోంది. బౌలింగ్ లో ఎంగిడి, నటరాజన్, ముకేశ్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోతుండడం కూడా ప్రత్యర్థి జట్లకు అడ్వాంటేజ్ గా మారింది.

Allu Arjun:ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన అల్లు అర్జున్.. హక్కుల కోసం సెలబ్రిటీల పోరాటానికి ఫుల్ స్టాప్ పడదా?

Exit mobile version