RCB
ఐపీఎల్ 19వ సీజన్ లో వీకెండ్ మ్యాచ్ లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది.
ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయినా చివరి వరకూ స్టబ్స్ పోరాటంతో పాటు మిల్లర్ మెరుపులు ఢిల్లీకి విజయాన్నందించాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ(RCB) అనుకున్న రీతిలో భారీస్కోరు సాధించలేకపోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ , విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 5.1 ఓవర్లలోనే 52 పరుగులు జోడించారు.
కోహ్లీ (19) త్వరగానే ఔటైనా సాల్ట్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే బెంగళూరు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం వారి జోరుకు బ్రేక్ వేసింది. పడిక్కల్ (18), పటిదార్ (8), జితేశ్ శర్మ (14), షెఫర్డ్ (1) నిరాశ పరిచారు. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 26 (3 ఫోర్లు, 1 సిక్సర్) కొద్దిసేపు భారీషాట్లతో అలరించాడు. కృనాల్ పాండ్యా కూడా నిరాశపరచడం, చివర్లో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఎంగిడి 2, కుల్దీప్ యాదవ్ 2 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. డెత్ ఓవర్స్ లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం ఆర్బీబీ(RCB) జోరుకు బ్రేక్ వేసింది.
తర్వాత ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా తడబడింది. కేవలం 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ నిస్సాంక (1) , ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2) పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 69 పరుగులు జోడించారు.
తన హోంగ్రౌండ్ కావడంతో రాహుల్ క్లాసిక్ షాట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ 34 బంతుల్లో 57 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటైన తర్వాత అక్షర్ పటేల్, స్టబ్స్ ఇన్నింగ్స్ నడిపించారు. ధాటిగా ఆడిన అక్షర్ పటేల్ (26) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
18వ ఓవర్ ను భువనేశ్వర్ , హ్యాజిల్ వుడ్ లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్ లో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఆఖరి ఓవర్ ను రూథర్ ఫర్డ్ చేత వేయించాడు. తొలి రెండు బంతుల్లో 2 పరుగులే ఇచ్చిన రూథర్ ఫర్డ్ తర్వాత రిథమ్ కోల్పోయాడు. ఫలితంగా మిల్లర్ 2 భారీ సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
