Sarfaraz Khan
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ప్రతీ అవకాశంలోనూ అంచనాలకు తగ్గట్టు రాణించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ స్థానానికి కనీసం నలుగురు పోటీలో ఉంటున్నారు. దీంతో వరుస అవకాశాల్లో విఫలమైతే మాత్రం వేటు పడడం ఖాయం.
తాజాగా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) గురించి ఇలాంటి చర్చే నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ లంకతో సిరీస్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొత్తలో బాగానే ఆడాడు. ఆరు టెస్టుల్లో నిలకడగానే రాణించినా ఫిట్నెస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
2024లో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడినప్పుడు అంతగా రాణించలేదు. అప్పుడే అతన్ని తప్పించారు. నిజానికి కివీస్‌పై కీలక బ్యాటర్లు సైతం విఫలమైనా కూడా సర్ఫరాజ్(Sarfaraz Khan) పైనే వేటు పడింది. ఒకవేళ బరువు ఎక్కువ ఉండడంతో పక్కన పెట్టారన్న అనుమానాలు కూడా వచ్చాయి.
దీంతోనే సర్ఫరాజ్ తన ఫిట్నెస్‌ఫై బాగా ఫోకస్ పెట్టాడు. గడిచిన 18 నెలల్లో అతను దాదాపు 17 కేజీల బరువు తగ్గాడు. ఒకప్పటి రూపానికి భిన్నంగా పూర్తిగా స్లిమ్ అయిపోయాడు. ఇప్పుడు మరింత ఫిట్‌గా మారడం అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచినట్లే అయింది.
ఇటీవల ముంబై టీ20 లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత తన ప్రాక్టీస్‌ను కాశ్మీర్‌కు షిప్ట్ చేశాడు . అక్కడ నెట్ బౌలర్లతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలోనే అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. జాతీయ జట్టులో చోటు కోసమే ఇలాంటి పోస్ట్ పెట్టాడా అన్న చర్చ కూడా నడిచింది.
అదే సమయంలో సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో అతని స్థానంలో లంకతో సిరీస్ కోసం సర్ఫరాజ్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు చర్చకు వచ్చాయి. కానీ గిల్, పంత్ తర్వాత స్పిన్‌ను బాగా ఆడే బ్యాటర్‌గా సర్ఫరాజ్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు.
జురెల్ కంటే కూడా మెరుగ్గా ఆడతాడన్న అంచనాలతో ఎంపిక చేశారు. మరి సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అవకాశం దక్కితే మాత్రం సర్ఫరాజ్ దానిని ఒడిసిపట్టుకుంటేనే జట్టులో కొనసాగే అవకాశముంటుంది.
Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?
