Ishan Kishan
ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త సమస్య వచ్చి పడింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసేందుకు సన్ రైజర్స్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ సారథ్య బాధ్యతలకు సంబంధించి జట్టులో పలువురు రేసులో ఉన్నారు.
కానీ విదేశీ ఆటగాళ్ల కంటే స్వదేశీ క్రికెటర్ల వైపే సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(Ishan Kishan) పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి పగ్గాలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టే. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అభిషేక్ కంటే కూడా ఇషాన్ కిషన్ కే కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయి.
దీనికి పలు కారణాలను చెబుతున్నారు. అభిషేక్ తో పోలిస్తే ఇషాన్ కిషన్ అనుభవమున్న ప్లేయర్. అలాగే దేశవాళీ క్రికెట్ లో జార్ఖండ్ టీమ్ ను నడిపించిన అనుభవం ఉంది. గత ఏడాది చివర్లో జార్ఖండ్ కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన ఘనత ఇషాన్ కే దక్కింది.
వ్యక్తిగతంగానూ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతని కెరీర్ లోనే అత్యుత్తమైన ఫామ్ ఇదే. దాదాపు ఏడాది క్రితం జట్టులో చోటు కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్(Ishan Kishan) పడి లేచిన కెరటంలా దూసుకొచ్చాడు.
దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపి ఏకంగా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు మెగాటోర్నీలో భారత్ విజయానికి కారణమయ్యాడు. ప్రపంచకప్ విజయంలో అభిషేక్ శర్మ ఒకటిరెండు మ్యాచ్ లలో మోస్తరుగా రాణిస్తే ఇషాన్ కిషన్ మాత్రం కీలక మ్యాచ్ లలో అదరగొట్టి తనపై అంచనాలను నిలబెట్టుకున్నాడు.
దీంతో కెప్టెన్సీ విషయంపై సన్ రైజర్స్ ఇప్పటికే అతనితో చర్చించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పైగా ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కావడం మరో అడ్వాంటేజ్. సారథిగా ఒక కెప్టెన్ ఉంటే బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్ వంటి విషయాల్లో సులభమైన పరిస్థితులు ఉంటాయి. అదే సమయంలో అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అతనిపై కెప్టెన్సీ భారం ఉంచి, అనవసర ఒత్తిడి పెంచడం సరికాదని సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇషాన్ కిషన్ మార్గనిర్దేశకత్వంలో అభిషేక్ శర్మను భవిష్యత్తులో సారథిగా తీర్చిదిచ్చే ఆలోచనలో ఉంది.
