Team India : టీమిండియా ఆల్ రౌండ్ షో..జింబాబ్వేపై టీ20 సిరీస్ కైవసం

Team India : బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులు, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన పేసర్లు , స్పిన్నర్లు భారీ విజయాన్ని అందించారు.

Team India

ఎట్టకేలకు భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. వరుసగా రెండు వైట్ వాష్ పరాభవాలతో భంగపడిన శ్రేయాస్‌కు జింబాబ్వే టూర్‌లో సిరీస్ విజయం దక్కింది. వరుసగా రెండో టీ20లోనూ టీమిండియా(Team India) గ్రాండ్ విక్టరీ కొట్టింది.

బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులు, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన పేసర్లు , స్పిన్నర్లు భారీ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. అశోక్ శర్మ స్థానంలో యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిరాశ పరిచారు. అభిషేక్ శర్మ (8), వైభవ్ సూర్యవంశీ (20) పరుగులకే ఔటవగా.. తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు.

శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులకు ఔటైనా , ఇషాన్ కిషన్ తిలక్ వర్మతో కలిసి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కేవలం 43 బంతుల్లోనే 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులకు ఔటయ్యాడు.

టీ20 ఫార్మాట్‌లో నిదానంగా ఆడుతున్నాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మ తన బ్యాట్‌తోనే అందరికీ సమాధానమిచ్చాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్ (12) పరుగులకు వెనుదిరగ్గా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ , రిచర్డ్ నగరవ , బ్రాడ్ ఎవాన్స్ , బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ పడగొట్టారు.

Team India

తర్వాత ఛేజింగ్‌లో జింబాబ్వే ఆరంభం నుంచే చేతులెత్తేసింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. బెన్ కురాన్ (1), మెర్స్ (12) పరుగులకు ఔటవగా.. దాటిగా ఆడే క్రమంలో బెన్నెట్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 రన్స్‌కు వెనుదిరిగాడు. ఇక్కడ నుంచి జింబాబ్వే మళ్లీ కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా, చివర్లో అభిషేక్ శర్మ బంతితో సత్తా చాటాడు. 3 వికెట్లతో జింబాబ్వే ఇన్నింగ్స్‌కు 129 పరుగులకే తెర దించాడు. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం ఇదే వేదికగా జరుగుతుంది.

SIR : ఏపీలో 10 శాతం ఓట్లు గాయబ్..జూలై 31న రాబోతున్న డ్రాఫ్ట్ లిస్ట్‌ మీకు షాకిస్తుందా?

Exit mobile version