Vaibhav
ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ పెద్దగా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడని వైభవ్(Vaibhav) తుది పోరులో రెచ్చిపోయాడు. గత మ్యాచ్ లో లంక ఆటగాళ్లు రెచ్చగొట్టారన్న కసితో మరింత చెలరేగిపోయాడు. క్రీజులోకి వస్తూనే లంక ఏ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
పవర్ ప్లే తొలి 10 ఓవర్లలో అయితే లంక బౌలర్లకు, ఫీల్డర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాదడమే పనిగా పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తొలి బంతినే ఫోర్ కొట్టి బుడ్డోడు తర్వాత వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.
ఆరో బంతిని డాట్ చేసిన వైభవ్ తర్వాత వరుసగా 6, 4, 4, 6, 6 కొట్టి కేవలం 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదేశాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట ఉండేది. 2005లో అతడు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఇదే జోరులో సెంచరీ చేస్తాడనుకున్నారు. దానికి తగ్గట్టే ఫిఫ్టీ కొట్టిన తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. సెంచరీ కూడా సరికొత్త రికార్డుతో బాదుతాడని అంతా ఎదురుచూస్తుండగా 94 పరుగుల దగ్గర ఔటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా ఆరు పరుగులతో శతకాన్ని చేజార్చుకున్నాడు, లంక ఏ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 రన్స్ చేశాడు, అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. అంటే 88 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి.
వైభవ్ క్రీజులో ఉన్నంతసేపూ భారత్ రన్ రేట్ ఓవర్ కు 15కు పైగా సాగింది. కేవలం బౌండరీలు, సిక్సర్లు మాత్రమే కొట్టిన వైభవ్ దెబ్బకు లంక బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అనవసరంగా రెచ్చగొట్టామా అంటూ వారంతా ఫీలైనట్టు కనిపించింది. అయితే వైభవ్(Vaibhav) సెంచరీ చేజార్చుకోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.
ఇటీవల ఐపీఎల్ లో కూడా పలుసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ పై మెరుపులు మెరిపించాడు. తర్వాత క్వాలిఫైయర్ 2లోనూ గుజరాత్ పైనా చెలరేగిపోయాడు. ఆ రెండు మ్యాచ్ లలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి శతకం చేజారినట్టయింది. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసంతో భారత్ ఏ 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.
