Vaibhav Sooryavanshi
ఐపీఎల్ 2026 ముగింపు వేడుకల్లో ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా స్టేజ్ మొత్తం ఒకే ఒక్కడు ఆక్రమించేశాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన అద్భుత సంచలనంగా పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi).. ఈ ఏడాది జరిగిన అవార్డుల పండుగలో పెద్ద పెద్ద స్టార్లను పక్కకు నెట్టేసి, అందరి కళ్లూ తనవైపే తిప్పుకుంటూ అవార్డుల సునామీ సృష్టించాడు .
మైదానంలో దిగితే చాలు సీనియర్లు, అంతర్జాతీయ బౌలర్లకు కూడా చుక్కలు చూపించిన ఈ చిన్నోడు.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌ను పూర్తిగా వణికించేశాడనే చెప్పొచ్చు. క్రికెట్ ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో రికార్డులను ఈజీగా కొల్లగొట్టి, భారత క్రికెట్ భవిష్యత్తుకు తానే రియల్ సూపర్ స్టార్ అని ప్రపంచానికి చెప్పకనే చెప్పేశాడు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ కిశోరం, టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకు పరుగుల వేటను ఒక యజ్ఞంలాగే కొనసాగించాడు. సీజన్ మొత్తంలో కూడా ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ ఏకంగా 776 రన్స్ భారీ స్కోరుతో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచి, మోస్ట్ ప్రెస్టీజియస్ ఆరెంజ్ క్యాప్‌ను తన ముద్దుల చేతుల్లోకి తీసుకున్నాడు.
ఈ బుడ్డోడు బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తే చాలు.. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవాల్సిందే అన్నట్లుగా సాగిపోయింది ఈ సీజన్. బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో తాతల నాటి రికార్డులను బద్దలు కొట్టి మరీ.. 237.3 పవర్ ఫుల్ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును దక్కించుకున్నాడు.
అంతేకాదు, ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 72 రికార్డ్ బ్రేకింగ్ సిక్సర్లు బాది సూపర్ సిక్సెస్ అవార్డును కూడా అంతే ఈజీగా తన అకౌంట్‌లో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తూ 436.5 పాయింట్లతో ఈ సీజన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) గా నిలవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఈ బుడ్డోడు ఏకంగా ఆరు అవార్డులతో స్టేజ్ మొత్తాన్ని స్వీప్ చేసేశాడు.
అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడిన వైభవ్(Vaibhav Sooryavanshi).. జట్టులోని సీనియర్లు, సహాయక సిబ్బంది తనకు ఎంతో మద్దతుగా నిలిచారని, ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఒత్తిడిని ఎలా ఓవర్ కమ్ చేయాలో నేర్చుకున్నానని ఎంతో వినయంగా చెబుతూనే భావోద్వేగానికి లోనయ్యాడు. మొత్తంమీద ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు వేడుకలు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) అనే ఏకైక సూపర్ స్టార్ చుట్టూ తిరుగుతూ, అభిమానులకు సరికొత్త జోష్‌ను అందించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవార్డుల పండుగలో.. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కాగా ఐపీఎల్ 2026 అవార్డుల లిస్ట్‌లో బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కాగిసో రబడ కూడా వికెట్ల సునామీ సృష్టించాడు. ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లను టకటకా పడగొట్టిన రబడ… 29 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులలో వణుకు పుట్టించాడు. ఈ సీజన్ మొత్తంలో ఏకంగా 172 డాట్ బాల్స్ వేసి, టోర్నీలోనే ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నయా రికార్డు సృష్టించాడు. అలాగే ఈ సీజన్ మొత్తంలో అత్యధికంగా 75 ఫోర్లు కొట్టినందుకు సాయి సుదర్శన్‌కు స్పెషల్ అవార్డు లభించింది.
ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే ఈ ఏడాది నమ్మశక్యం కాని క్యాచ్‌లు నమోదయ్యాయి. అయితే వీటన్నింటిలోకి హైలైట్‌గా నిలిచిన.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ టిమ్ డేవిడ్‌ను అవుట్ చేయడానికి మనీష్ పాండే గాల్లోకి లేస్తూ చిరుతపులిలా అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు వచ్చింది.
అలాగే మైదానంలో ఎంతో క్రమశిక్షణతో క్రీడా స్ఫూర్తిని చాటుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఫేర్ ప్లే అవార్డును ఓన్ చేసుకుంది. మైదానాల మేనేజ్మెంట విషయానికి వస్తే, తక్కువ మ్యాచ్‌లు జరిగిన విభాగంలో.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉత్తమ పిచ్ అవార్డును గెలుచుకుంది. ఇక ఐదు కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిగిన విభాగంలో.. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌కు.. ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ లభించింది.
