Mukul Choudhary : వచ్చేసాడు మరో యువ సంచలనం…ఎవరీ ముకుల్ చౌదరి ?

Mukul Choudhary : అద్భుతాలు ఎక్కడి నుంచో రావు.. మన చుట్టూనే ఉంటాయి... అది ఏ రంగంలోనైనా కావొచ్చు.. గత కొన్నేళ్ళుగా ఐపీఎల్ ఇలాంటి అద్భుతాలకు వేదికగా మారిపోయింది

Mukul Choudhary

అద్భుతాలు ఎక్కడి నుంచో రావు.. మన చుట్టూనే ఉంటాయి… అది ఏ రంగంలోనైనా కావొచ్చు.. గత కొన్నేళ్ళుగా ఐపీఎల్ ఇలాంటి అద్భుతాలకు వేదికగా మారిపోయింది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ లో దాగి ఉన్న టాలెంట్ ను వెలికితీయడమే లక్ష్యంగా ఈ లీగ్ ప్రారంభించారు. దానికి తగ్గట్టే ప్రతీ సీజన్ నుంచీ ఎంతో మంది వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల వేలం నుంచి సీజన్ పూర్తయ్యే వరకూ రాత్రికి రాత్రి హీరోలయిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.

ఎంతో టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లకు ఐపీఎల్ గొప్ప వేదికన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చాడు. నిన్నటి వరకూ ఎవరో కూడా తెలియని ముకుల్ చౌదరి(Mukul Choudhary) ఒక్క ఇన్నింగ్స్ తో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. అసలు ఎవరీ ముకుల్ చౌదరి.. లక్నో ఫ్రాంచైజీ అతన్ని తీసుకోవడానికి కారణమేంటి.. ప్రస్తుతం చాలా మంది అభిమానులు ఇదే ఆరా తీస్తున్నారు.

రాజస్థాన్ కు చెందిన ఈ 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ను లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో రూ. 2.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఒక యువ క్రికెటర్ కోసం ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించాయంటే ఆ ప్లేయర్ లో అద్వితీయమైన నైపుణ్యం ఉండాల్సిందే.

ముకుల్ చౌదరిలో ఉన్న ఆ నైపుణ్యమే అలవోకగా సిక్సర్లు బాదడం… నిజానికి ఈ మ్యాచ్ జరుగుతుండగా బౌండరీ అవతల లక్నో ఫ్రాంచైజీ గ్లోబల్ డైరెక్టర్ టామ్ మూడీ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడు కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు మూడీ చెప్పిన సమాధానం ఒక్కటే. ముకుల్ చౌదరి సిక్సర్లు హిట్టింగ్ చేసే సామర్థ్యం తమను బాగా ఆకట్టుకుందని, అవకాశం దొరికిన రోజు అతను మ్యాచ్ ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పాడు.

Mukul Choudhary

మూడీ ఈ మాట చెప్పిన కొన్ని నిమిషాలకే తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేసాడు ముకుల్ చౌదరి. ముందు 6 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసిన ముకుల్ చివర్లో విధ్వంసం సృష్టించాడు. బంతి ఎలా వేసినా సిక్సర్ బాదేశాడు. ముకుల్ ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. అంటే అతని స్కోరు (54)లో 50 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. ముకుల్ చౌదరిని లక్నో టాలెంట్ స్కౌట్ టీమ్ దేశవాళీ క్రికెట్ ప్రతిభ ఆధారంగానే తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు.

విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు. ముందు మీడియం ఫాస్ట్ బౌలర్ గా ఉన్న ముకుల్ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ గా, ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ , హిట్టింగ్ సామర్థ్యం నచ్చే వేలంలో పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి లక్నో తుది జట్టులో అతనికి అవకాశం ఇవ్వడం, దానిని నిలబెట్టుకోవడంతో ఇప్పుడు ముకుల్ చౌదరీ క్రికెట్ వర్గాల్లో ట్రెండింగ్ అయిపోయాడు.

Gold Prices : 2 లక్షలకు చేరుతుందా.. లక్షకు దిగొస్తుందా ?…బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు

Exit mobile version