Chennai : చెన్నై జోరు కొనసాగేనా ? పరువు కోసం లక్నో పోరాటం

Chennai : సీజన్ ఫస్టాఫ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ సెకండాఫ్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది.

Chennai

ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మరో 10 రోజుల్లో ముగుస్తున్నా సరే.. ఇప్పటి వరకూ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోలేదు. రెండు జట్లు మాత్రమే ఇంటిదారి పట్టగా మిగిలిన 8 జట్లు రేసులో ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు ఏ జట్టు అర్హత సాధిస్తుందోనన్న ఆసక్తి పెరిగిపోతోంది.

ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai) కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సీజన్ ఫస్టాఫ్ లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai) సెకండాఫ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ బెర్తుపై కన్నేసింది.

ప్రస్తుతం సీఎస్కే 11 మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ లో ఉంది. లక్నోపై గెలిస్తే టాప్ 4లోకి అడుగుపెడుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లూ గెలవాల్సి ఉంటుంది. చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడంతో చెన్నైకి ప్రతికూలంగా మారినా సంజూ శాంసన్, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బాగానే పుంజుకుంది.

కాగా స్టార్ ప్లేయర్ ధోనీ ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాటింగ్ సంజూ , ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ ఫామ్ లో ఉన్నారు. దూబే , బ్రెవిస్ కూడా చెలరేగితే చెన్నైకి తిరుగుండదు. బౌలింగ్ లో ఓవర్టన్ దూరమవడంతో ఇబ్బందే. దీంతో అన్షుల్ కాంబోజ్ , స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి పేస్ భారాన్ని మోయనుండగా.. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్, అకిల్ హొస్సేన్ సత్తా చాటుతున్నారు.

మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ పరువు కోసం పోరాడనుంది. ఈ సీజన్ లో లక్నో అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 11 మ్యాచ్ లు ఆడి కేవలం మూడింటిలోనే గెలిచి, 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచ్ లలోనైనా గెలిచి సీజన్ ను మెరుగైన స్థానంలో గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది.

CHENNAI

బ్యాటింగ్ లో కీలక ఆటగాళ్ల వైఫల్యమే లక్నో ఓటములకు కారణం. ఓపెనర్లతో పాటు మిగిలిన బ్యాటర్లలో నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలాగే నికోలస్ పూరన్ కూడా ఫెయిలయ్యాడు. వీరిద్దరి వైఫల్యం లక్నో బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావమే చూపించింది.

కనీసం చివరి మ్యాచ్ లలోనైనా వీరిద్దరూ ఫామ్ అందుకుంటారేమో చూడాలి. బ్యాటింగ్ లో మార్ష్ , ఇంగ్లీస్ రాణిస్తుండగా బౌలింగ్ లో షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠి సత్తా చాటుతున్నారు. గత రికార్డుల్లో రెండు జట్లు సమంగా ఉన్నాయి. లక్నో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా.

 

Exit mobile version