Balapur Ganesh Laddu
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో ఖైరతాబాద్ బడా గణపయ్య ఎలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారో బాలాపూర్ బొజ్జ గణపతి లడ్డూ వేలం పాట కూడా అంతే రేంజ్ సంచలనం క్రియేట్ చేస్తూ ఉంటుంది. అసలు బాలాపూర్ లడ్డూ(Balapur Ganesh Laddu) చేతికి చిక్కితే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందనే నమ్మకం ఎన్నోఏళ్లుగా భక్తుల్లో బలంగా పాతుకుపోయింది.
అందుకే గణేష్ నవరాత్రుల సమయంలో లడ్డూ వేలం పాట అంటే చాలు.. కోట్లాది మంది కళ్లు బాలాపూర్ వైపే ఉంటాయి. ఈసారి కూడా శోభాయాత్రకు ముందే స్వామివారికి పూజలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు మినీ ట్రక్కుపై ఊరేగింపుగా ఊరంతా తిప్పి గ్రామంలోని బొడ్రాయి దగ్గరకు చేరాక.. ఆ ప్రసిద్ధ లడ్డూ వేలం పాటను షురూ చేశారు. అయితే భక్తులు పోటాపోటీగా పాడే ఈ వేలం ద్వారా వచ్చే డబ్బులను గణేష్ ఉత్సవ సమితి సమాజ సేవకు ఉపయోగిస్తుంది.
33 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ లడ్డూ వేలం పాటకు ఒక చిత్రమైన రికార్డు ఉంది. ప్రతీ ఏడాది లడ్డూ ధర ఆకాశాన్ని తాకడమే తప్ప తగ్గిన చరిత్ర లేదు. 1994లో మొట్టమొదటిగా వేలం పాట పాడినపుడు.. కొలను మోహన్ రెడ్డి అనే ఒక సాధారణ రైతు కేవలం రూ.450తో లడ్డూను దక్కించుకున్నారు. ఆ ప్రసాదాన్ని కుటుంబసభ్యులంతా తిని, పంట పొలాల్లో చల్లితే ఊహించనంతగా దిగుబడి పెరిగిందన్న సెంటిమెంట్‌తో.. మరుసటి ఏడాది కూడా ఆయనే లడ్డూ పాటను దక్కించుకున్నారు.
ఇక అక్కడి నుంచే బాలాపూర్ లడ్డూ(Balapur Ganesh Laddu) సెంటిమెంట్ ఊపందుకుంది. 2002లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు పాడి తొలిసారిగా లడ్డూ ధరను లక్ష మార్కును దాటించారు. ఆ తర్వాత ధర ఏటా లక్షల్లోనే దూసుకెళ్లింది. 2007లో రఘునందన్ చారి రూ.4.15 లక్షలకు పాడగా, 2015లో కల్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10.32 లక్షలకు పాడి పది లక్షల మార్కును దాటేశారు.
ఆ తర్వాత లడ్డూ క్రేజ్ వేరే లెవెల్‌కి వెళ్లిపోయింది. 2016లో స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలకు చేజిక్కించుకోగా, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు అలాగే 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అలా వరుసగా మూడేళ్లు స్థానికులకు కాకుండా.. స్థానికేతరులకే ఆ లంబోదరుడి ఆశీస్సులు లభించాయి.
ఇక 2019లో పక్కా స్థానికుడు అయిన కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2020లో కరోనా మహమ్మారి వల్ల వేలం పాట రద్దవడంతో ఉత్సవ సమితి ఆ లడ్డూను అప్పటి సీఎం కేసీఆర్‌కు బహుకరించింది. తిరిగి 2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి ఇద్దరూ కలిసి రూ.18.90 లక్షలకు పాడారు. 2022లో ఊహించని విధంగా రూ.5 లక్షలను దాటి వంకేటి లక్ష్మా రెడ్డి రూ.24.60 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఇక 2023లో దయానందరెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకోగా, 2024లో కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు లడ్డూను చేజిక్కించుకున్నారు. 2025లో లింగాల దశరథ్ గౌడ్ ఏకంగా రూ.35 లక్షలకు లడ్డూని పాడుకుని సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశారు.
ఈ ఏడాది అంటే 2026 వేలంలో సామ ప్రణీత్ రెడ్డి గతంలో ఉన్న అన్ని రికార్డులనూ బద్దలు కొడుతూ ఊహించని విధంగా రూ.39 లక్షలకు లడ్డూను చేజిక్కించుకుని రికార్డ్ బుక్స్‌లోకి ఎక్కేశారు. 32 ఏళ్ల కిందట కేవలం రూ.450తో స్టార్ట్ అయిన ఒక చిరు వేలం పాట.. ఈరోజుకి రూ.39 లక్షలకు చేరడం బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh Laddu) మహిమకు, భక్తుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.
Liking Gap : మాట్లాడాక అయ్యో తప్పు మాట్లాడేసానా అని ఫీలవుతున్నారా? ఇది మీ మైండ్ చేసే మైండ్ గేమ్
