Bhadrachalam
దక్షిణ అయోధ్యగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త ఆధ్యాత్మిక వైభవం సంతరించుకోవడానికి సిద్ధమవుతోంది. భద్రాద్రి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అదనపు హంగులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
జూన్ 27వ తేదీ శనివారం రోజు భద్రాద్రి ఆలయ మహాభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ రెవెన్యూ అండ్ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో..ఈ భద్రాచల(Bhadrachalam) క్షేత్రాన్ని యాదగిరిగుట్ట తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భద్రాచలం(Bhadrachalam) ఆలయ పూర్తి డెవలప్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ. 351 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులతో ఆలయ పరిసరాలను, భక్తుల వసతులను ఎంతగానో మెరుగుపరచనున్నారు. కేవలం ఆధునిక హంగులతో కాకుండా, హిందూ సంప్రదాయాల ప్రకారం ఆగమశాస్త్ర నియమాలు కచ్చితంగా పాటిస్తూ ఈ పనులన్నిటిని జరిపిస్తున్నారు.
భద్రాద్రి రామయ్య ఆలయం యొక్క పవిత్రతకు, ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి భంగం కలగకుండా చూడటమే కాకుండా.. పూర్వకాలపు సంప్రదాయ శిల్పకళను దేవాలయం పరిసరాలలో ప్రతిబింబించేలా పూర్తిగా రాతి నిర్మాణాలకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రెండు వందల సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను మరియు భక్తుల రద్దీని ముందే ఊహించి, రాబోయే తరాలకు మన సంస్కృతి తెలిసేలా ఈ ఆలయాన్ని మలచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై హైదరాబాద్ సచివాలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈవోతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రభుత్వం నిర్ణయించిన గడువు లోపలే పునర్నిర్మాణ పనులన్నీ కూడా వంద శాతం పూర్తయ్యేలా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
భక్తులకు కల్పించే సౌకర్యాలలో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదని మంత్రి పొంగులేటి చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగబోయే శ్రీరామనవమి వేడుక నాటికే అత్యంత ప్రధానమైన దేవాలయ పనులన్నీ కూడా పూర్తయ్యేలా చూడాలని, దీనికోసం ఈ ప్రాజెక్టును వేర్వేరు విభాగాలుగా విభజించి, అన్ని పనులను ఒకేసారి సమాంతరంగా ప్రారంభించాలని చెప్పారు.
రాబోయే రోజుల్లో భద్రాచలం వచ్చే ప్రతీ భక్తుడికి సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ఆలయ ప్రాచీన నిర్మాణ శైలి , వాస్తు శిల్పకళా వైభవం మరింతగా ఉట్టిపడుతూ ఉండేలా రాతి కట్టడాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే ఈ పనులు జరిగే సమయంలో భద్రాద్రి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఈ పనులు రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుండటంతో తెలంగాణ వాసులతో పాటు రామయ్య భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది.
Scuba Diving : అండర్ వాటర్ టూరిజం క్రేజ్.. ఇండియాలో స్కూబా డైవింగ్‌కు బెస్ట్ ప్లేసెస్ ఇవే
