Caste Census
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం రాత్రి మంత్రులు రిలీజ్ చేసిన ఈ గణాంకాలు తెలంగాణలోని కులాల వారీ జనాభా(Caste Census )నిష్పత్తిని అఫీషియల్‌గా ధ్రువీకరించాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు కోటి 12 లక్షలకు పైగా కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తెలంగాణలో 3 కోట్ల 55 లక్షల 50 వేల మంది జనాభా ఉన్నట్లు కులగణనలో తేలింది.
ఈ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తెలంగాణ జనాభాలో సగానికి పైగా అంటే 56.36 శాతం మంది వెనుకబడిన తరగతుల (BC) వారే ఉన్నట్లు రేవంత్ సర్కార్ వెల్లడించింది.
మొత్తం జనాభా వర్గీకరణను పరిశీలిస్తే, ముందుగా బీసీలు వారి తర్వాత ఎస్సీలు 17.42 శాతం, ఎస్టీలు 10.43 శాతం, ఓబీసీలు 15.79 శాతంగా నమోదయ్యారు. కుల ప్రస్తావన అవసరం లేదని చెప్పిన వారు మాత్రం కేవలం 4 శాతమే ఉన్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలలో ఉన్న టాప్ 20 కులాల జాబితాను కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది.
దీనిలో ముదిరాజ్ సామాజిక వర్గం 7.4 శాతం జనాభా అంటే దాదాపు 26.39 లక్షలతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత 5.7 శాతంతో యాదవ లేదా గొల్ల వర్గం, గౌడ కమ్యూనిటీలో 16.30 లక్షలతో వరుస స్థానాల్లో ఉన్నాయి. వీరితో పాటు మున్నూరు కాపు, పద్మశాలి, రజక , కురుమ వంటి కులాల వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నట్లు కులగణన సర్వే స్పష్టం చేస్తోంది.
అయితే, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలిపి చూసినప్పుడు జనాభా పరంగా మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా 10.3 శాతంతో అంటే 36.57 లక్షలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. వీరి తర్వాత వరుసగా ముదిరాజ్‌లు రెండో స్థానంలో, లంబాడీ లేదా బంజారాలు మూడో స్థానంలో నిలిచారు.
అలాగే యాదవులు నాలుగో స్థానంలో ఉండగా, రెడ్డి సామాజిక వర్గం వారు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో చివరగా 1.1 శాతం జనాభాతో గోండ్ సామాజిక వర్గం 20వ స్థానంలో నిలిచింది.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించే ఈ కులగణన సమగ్ర గణాంకాలను (Caste Census )ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫ్యూచర్‌లో సంక్షేమ పథకాల రూపకల్పనలో , రిజర్వేషన్ల వంటి కీలక నిర్ణయాల్లో ఈ డేటా అత్యంత కీలక భూమిక పోషించబోతోంది.
ఈ సర్వే ఫలితాల ద్వారా తెలంగాణలోని ఏ సామాజిక వర్గం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాజకీయ, సామాజిక సమీకరణాల్లో కూడా ఇది పెను మార్పులకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
Gold :ఆగని పసిడి పరుగు.. మూడు రోజులుగా పెరుగుతూనే ఉన్న రేట్లు
