IPS Uday Krishnareddy
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)ని కుదిపేస్తున్న సహ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపుల వ్యవహారం..ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది.
ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి(IPS Uday Krishnareddy) ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విషమ స్థితిలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని వెంటనే ఎర్రగడ్డలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని సమాచారం.
ఈ కేసుకు సంబంధించి అసలు విషయానికి వస్తే.. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డి(IPS Uday Krishnareddy)పై ఫిర్యాదు చేశారు. ఉదయ్ కొన్నాళ్లుగా తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని, అంతటితో ఆగకుండా తలుపులు వేసి బలవంతంగా గదిలోకి లాక్కెళ్లడమే కాకుండా.. మెడపై కత్తిపెట్టి ప్రాణ భయం పుట్టించాడని ఆరోపించారు.
అంతేకాకుండా బాధితురాలి ప్రైవేట్ వీడియోలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, బాధితురాలి భర్తకే వాట్సాప్‌లో పంపించి తీవ్ర స్థాయి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడని ఫిర్యాదులో చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని కొన్ని కఠినమైన సెక్షన్లతో పాటు.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు స్పీడప్ చేశారు.
మరోవైపు అకాడమీ లోపల జరిగిన ఈ దారుణంపై నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ వెంటనే ఇంటర్నల్ ఇన్విస్టిగేషన్ జరిపింది. సీసీటీవీ ఫుటేజీలతో పాటు ఇతర డిజిటల్ ప్రూఫ్‌ను నిశితంగా పరిశీలించిన కమిటీ, బాధితురాలు చేసిన ఆరోపణల్లో ప్రాథమిక నిజాలు ఉన్నాయని కన్ఫమ్ చేసుకుని ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. అయితే తనకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో.. ఉదయ్ తన వాట్సాప్ స్టేటస్‌లో తాను ఎలాంటి తప్పూ చేయలేదని మెసేజ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ జర్నీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ , చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. నానమ్మ కూలి పని చేసి తెచ్చిన డబ్బులతోనే కష్టపడి చదివి, 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.
అయితే ఒక సీఐ అందరి ముందూ చేసిన అవమానాన్ని సవాల్‌గా తీసుకుని, 2018లో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. వరుసగా 4 సార్లు విఫలమైనా పట్టు వదలకుండా ఐదో ప్రయత్నంలో ఆల్ ఇండియా 360వ ర్యాంక్ సాధించిన ఉదయ్.. ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.
కాగా త్వరలోనే పూర్తిస్థాయి ఆఫీసర్‌గా ఖాకీ డ్రెస్ వేసుకోవాల్సిన ఒక సివిల్స్ విజేత.. ఇప్పుడు ఇలా లైంగిక ఆరోపణల్లో చిక్కుకుని ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లడం పోలీస్ వర్గాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
Ration Card : జూలై 31 తర్వాత వారికి ఉచిత రేషన్ కట్? మీకు రేషన్ కార్డ్ ఉంటే వెంటనే ఈ పని చేయండి..
