Laddu Auction
హైదరాబాద్‌లో వినాయక నవరాత్రుల వేడుకలు ఎండింగ్ స్టేజ్‌కు చేరడంతో గణేష్ లడ్డూల వేలానికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడుతోంది. సిటీవ్యాప్తంగా అనేక అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లో లంబోదరుడి లడ్డూ వేలం పాటలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఐటీ కారిడార్‌లోని కొండాపూర్ పరిధిలో ఉన్న ఇండిస్ వివా సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం సరికొత్త రికార్డులను తిరగరాస్తూ లోకల్‌గా హాట్ టాపిక్ అయింది.
పోటీపడి మరీ సాగిన ఈ లడ్డూ వేలం(Laddu Auction) పాటలో రామ్‌శ్రీ గౌతమ్, ఆయన భార్య వైశాలి భోలేవార్ దంపతులు అందరినీ దాటుకుని ఏకంగా రూ.13.21 లక్షల భారీ మొత్తానికి ఆ స్వామివారి దివ్య ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. విశేషమేమిటంటే.. లాస్ట్ ఇయర్ ఇదే వివా సిటీలో ఈ లడ్డూ రూ.12.90 లక్షలకు వేలం పాడగా, ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ రూ.13.21 లక్షలకు ధర పలకడం విశేషంగా నిలిచింది.
ఈ లడ్డూ వేలం(Laddu Auction) పాట ఒక్క భక్తికి మాత్రమే పరిమితం కాకుండా ఆత్మీయ ఘట్టానికి కూడా వేదికగా మారింది. రామ్‌శ్రీ గౌతమ్ ఆ లడ్డూ ప్రసాదాన్ని తన పేరెంట్స్ బాల రంగయ్య, రమణికి అంకితమిస్తూ తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. భక్తి, ఫ్యామిలీ రిలేషన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ఒకే చోట కలబోసినట్లు కనిపించిన ఈ దృశ్యం అపార్ట్‌మెంట్ వాసుల హృదయాలను గెలుచుకుంది.
ఇక ఈ వేలంలో వచ్చిన రూ.13.21 లక్షలను వచ్చే ఏడాది నిర్వహించబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు, ఇతర కమ్యూనిటీ కార్యక్రమాలకు యూజ్ చేస్తామని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతీ ఏడాది కాలనీవాసులంతా ఒక్కటై జరుపుకొనే ఈ గణేషుడి వేడుకలు వారి మధ్య ఉన్న సామాజిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందిస్తుందని అక్కడి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sugar : పంచదారకు బై చెప్పేశారా? సైంటిస్టులు చెబుతున్న ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..
