Pawan Kalyan
గత పది రోజులుగా తెలంగాణ పాలిటిక్స్ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రొ.నాగేశ్వర్ చేసిన కామెంట్స్ వల్ల మొదలైన రచ్చ ఇప్పుడు ప్రాంతీయ వాదం, ఆంధ్రా పెత్తనం అంటూ ఎటో వెళ్లిపోయింది. అదే సమయంలో తెలంగాణలోని జనసేన నాయకులు హైదరాబాద్ లో సమావేశానికి ఏర్పాట్లు చేసుకోగా పవన్ హాజరుకానున్నట్టు సమాచారం రావడంతో మరింత హీటెక్కింది.
ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, అటు కాంగ్రెస్ నేతలు పవన్(Pawan Kalyan) పై తీవ్రస్థాయిలో మండిపడడంతో పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో హైదరాబాద్ లోని తన నివాసంలోనే పవన్ ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించిన కాంగ్రెస్ నేతలకు గట్టిగా ఇచ్చిపడేశారు. ప్రజలు బాగానే ఉన్నా కొందరు నేతలు రెచ్చగొట్టేలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ అనలిస్ట్ చేసిన కామెంట్స్ తో ఈ వివాదం మొదలవగా.. దానికి తాను స్పందించడంతో తెలంగాణను అవమానించానంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తనను హైదరాబాద్ కు రానివ్వమనీ, తెలంగాణలో తిరగనివ్వమంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడడంపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తనను బెదిరించడానికి మీరెవరు అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కాంట్రాక్టర్లు ఆంధ్రాలో, ఆంధ్రా కాంట్రాక్టర్లు, వ్యాపారావేత్తలు తెలంగాణలో వ్యాపారాలు చేయొచ్చనీ, జనసేన మాత్రం తెలంగాణలో ఉండకూడదా అంటూ ప్రశ్నించారు.
2019 లో తాను ఓడినప్పుడు తెలంగాణ నాయకులు మద్దతుగా నిలిచారన్నారు. అయితే జనసేన తెలంగాణ పాలిటిక్స్ లో ఉంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదనీ.. దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమే ప్రెస్ మీట్ తన ఇంట్లోనే పెట్టానని చెప్పారు. బాంచెన్ మీ కాళ్లు మొక్కుతా అనుకుంటే పార్టీ ఎందుకు పెడతానంటూ ప్రశ్నించారు.
గత 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నేతను కూడా తాను ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు..
తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనీ, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు పవన్ ప్రకటించారు. తాను తెలంగాణను ఏ రోజూ అవమానించలేదని స్పష్టం చేశారు.
Married Daughters : పెళ్లయిన కుమార్తెలకు కారుణ్య నియామకాలు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు
