SIR
తెలంగాణలో ఈరోజు నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అయింది. అర్హులైన ఓటర్ల వివరాలను పక్కాగా సేకరించడమే టార్గెట్‌గా ఎన్నికల కమిషన్ ఈ భారీ కసరత్తుకు తెరలేపింది.
ఈ ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) అంటే .. ఓటర్ల లిస్టును పూర్తిగా ప్రక్షాళన చేసి, తప్పులు లేని పక్కా ఓటర్ల జాబితాను తయారు చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీనిలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను వారింటి దగ్గరే పంపిణీ చేయనున్నారు.
ఎవరైనా కావొచ్చు ఈ ఫారం నింపి ఇస్తేనే ముసాయిదా ఓటర్ లిస్టులో పేరు ఉంటుందని, లేదంటే ఓటు పోయే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈరోజు నుంచి వచ్చే నెల జులై 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగబోతోంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికీ వచ్చి, ప్రస్తుత ఓటరు లిస్టులో పేరున్న వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఈ ఫారంలో మీ పూర్తి వివరాలతో పాటు స్థానిక బీఎల్‌ఓ పేరు, ఫోన్ నంబర్ అన్నీ ఉంటాయి.
ఓటరు తన పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబరు వంటి వివరాలను మళ్లీ అందులో నింపి, ఒక కొత్త ఫోటోను యాడ్ చేసి, సైన్ చేసి జులై 24 లోగా మళ్లీ వచ్చే బీఎల్‌వోకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే కుటుంబ సభ్యులైనా దీనిని పూర్తి చేసి ఇవ్వొచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు మాత్రం బీఎల్‌వో నుంచి ఫారం-6 తీసుకుని నింపాలి.
ఈ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఇంటి వద్దే కాకుండా ఈసీ అఫీషియల్ వెబ్‌సైట్ (voters.eci.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లోనూ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఈ ఫారంతో పాటు ఎలాంటి ఐడెంటిటీ కార్డుల ఆధారాలు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
జులై 24తో ఎన్యూమరేషన్ ముగిసిన తర్వాత, జులై 31న డ్రాఫ్ట్ ఓటరు లిస్టును ప్రకటిస్తారు. ఈ ముసాయిదా లిస్ట్‌పై ఏవైనా అభ్యంతరాలు కానీ అడ్రస్ మార్పులు కానీ ఉంటే జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఆ సమయంలో ఈసీ సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల ఆధారాల్లో ఒకటి అయినా సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించి, అక్టోబరు 1వ తేదీన తెలంగాణ ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు.
ఒకవేళ ఓటర్ కనుక ఇల్లు మారితే అది కూడా వేరే నియోజకవర్గానికి ఓటు హక్కు ఎలా మార్చుకోవాలంటే.. మీ ఓటును కొత్త ప్రాంతానికి మార్చుకోవడానికి ఈసీ ఫారం-8 (Form 8) ను కేటాయించింది. దీనికోసం మీరు బీఎల్‌వోను కలిసి ఫారం-8 నింపి ఇవ్వొచ్చు లేదా ఈసీ వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో షిప్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ( Shifting of Residence )ఆప్షన్ ఎంచుకుని ఫారం-8 సబ్మిట్ చేయొచ్చు.
దీనికోసం మీ ప్రస్తుత అడ్రస్ ప్రూఫ్ అంటే కరెంట్ బిల్లు, ఆధార్ లేదా రెంట్ డీడ్ లాంటివి, సేల్ డీడ్ వంటివి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకుంటే మీ పాత ఓటు ఆటోమేటిక్‌గా రద్దయి, కొత్త నియోజకవర్గంలో మీ ఓటు నమోదవుతుంది.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 3, 38, 29,018 మంది ఓటర్లలో దాదాపు 69.92 శాతం మంది డీటెయిల్స్ గత రికార్డులతో సరిపోలాయి. అయితే, మిగిలిన 35.73 శాతం మంది అంటే దాదాపు సుమారు 89 లక్షల మంది పేర్లు, వయసు, అడ్రస్ వంటి వివరాల్లో కొంత వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ స్పెషల్ సవరణ ద్వారా వాటిపై పూర్తి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమని, ఓటర్లు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా బీఎల్‌వోలకు సహకరించాలని అధికారులు చెబుతున్నారు.
ఈ భారీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం ..తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,907 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పర్యవేక్షణ కోసం 119 మంది ఈఆర్‌వోలు, 882 మంది ఏఈఆర్‌వోలు, 3వేల596 మంది సూపర్‌వైజర్లతో పాటు 35వేల985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు పని చేస్తున్నారు. వీరితో పాటు రాజకీయ పార్టీలు నియమించిన 49వేల18 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) కూడా ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు.
Impress : అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా? అయితే మిమ్మల్ని మీరు ద్వేషిస్తున్నట్లేనట..
