Just Andhra Pradesh

Lulu Mall:విజయవాడలో లులు మాల్ ఎంట్రీ..ప్లేస్ కూడా ఫిక్స్

Lulu Mall: హైదరాబాదీలను నిత్యం ఆఫర్ల వర్షంలో ఓ ఊపు ఊపేస్తున్న లులు మాల్ (Lulu Mall)ఇప్పుడు విజయవాడలో అడుగు పెట్టబోతోంది.

Lulu Mall: హైదరాబాదీలను నిత్యం ఆఫర్ల వర్షంలో ఓ ఊపు ఊపేస్తున్న లులు మాల్ (Lulu Mall)ఇప్పుడు విజయవాడలో అడుగు పెట్టబోతోంది. అవును..ఏపీవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లులు మాల్ ఎంట్రీ ఇప్పుడు ఖాయమైనట్లు కనిపిస్తోంది. దీని కోసం విజయవాడ(Vijayawada) నడిబొడ్డున ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ బస్ డిపో స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక కొత్త బిగ్ షాపింగ్ మాల్ రావడం కాదు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి అవకాశాలకు, మెయిన్‌గా ఏపీ ప్రతిష్టకు ఊతమిచ్చే భారీ ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

Lulu Mall

గవర్నర్‌పేట-2 డిపో స్థానంలో లులు షాపింగ్ సామ్రాజ్యం..

పండిట్ నెహ్రూ బస్టాండ్‌ అంటే మెయిన్ బస్టాండ్‌కు అతి దగ్గరలో పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో ప్లేస్.. ఇప్పుడు లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు కేటాయించబడుతోంది. విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్ ఏర్పాటు చేయడానికి లులు గ్రూప్ ఆసక్తి చూపగా, ఏపీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ఈ రెండు చోట్లా కలిపి రూ..1,222 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడంతో పాటు, 1,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని లులు ప్రతిపాదించింది.

విజయవాడలో మాల్ ఏర్పాటుకు అనువైన భూమి కోసం ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) విస్తృతంగా పరిశీలించింది. చివరికి, సిటీకి ఆయువుపట్టు అయిన గవర్నర్‌పేట-2 డిపో స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ నుంచి ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు లేఖ కూడా అందింది. ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీకి ఇదే స్థలం కేటాయించమని స్పష్టమైన సూచనలు వచ్చాయని తెలుస్తోంది.

సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గవర్నర్‌పేట-2 డిపోలో ప్రస్తుతం గవర్నర్‌పేట-1, 2 డిపోలకు చెందిన బస్సులు నిలుపుతారు. కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థలాన్ని లులు మాల్ కోసం కేటాయిస్తుండటంతో.. ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో 5 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి చేరాయి.

తాజాగా జరిగిన ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో గవర్నర్‌పేట-2 స్థలాన్ని త్వరలోనే లులు సంస్థకు అప్పగించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థలంలో గతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఐరన్ స్క్రాప్ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మల పార్క్‌ను కూడా మాల్‌కే కేటాయించే అవకాశం ఉంది.

ఈ గవర్నర్‌పేట-2 డిపో ఉన్న ప్రదేశం ఒకప్పుడు విజయవాడలోని ప్రధాన బస్టాండ్‌గా ఉండేది. అప్పటి సీఎం ఎన్టీఆర్ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను నిర్మించడంతో, పాత బస్టాండ్ ప్రాంతం సిటీ బస్సుల కోసం గవర్నర్‌పేట-2 డిపోగా మారింది. ఇప్పుడు అదే చారిత్రక స్థలంలో అంతర్జాతీయ స్థాయి మాల్ రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ వల్ల 1,500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా మాల్‌తో అనుబంధంగా ఉండే ఇతర వ్యాపారాలు, సర్వీసుల్లో పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

అంతేకాదు ఇది కేవలం మాల్ కాదు, ఒక పర్యాటక ఆకర్షణ (Tourist Attraction) కూడా అవుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు షాపింగ్, వినోదం కోసం విజయవాడకు వస్తారు, దీనివల్ల పర్యాటక రంగానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇది విజయవాడకు ఒక కొత్త, గ్లోబల్ లుక్ తీసుకొస్తుంది. మొత్తంగా, లులు మాల్ రాకతో విజయవాడ రూపురేఖలు మారనున్నాయనడంలో అనుమానం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button