Just Literature

Literature : అదే నేల… అదే గాలి…

Literature :ఏమిస్తున్నావు..? నీ తరువాత తరానికి..

Literature :

 

ఏమిస్తున్నావు..?

నీ తరువాత తరానికి..

కూడేసిన ధనమా?

కట్టేసిన భవనమా?

 

నీరు లేక బీటలేసిన భూమి

గూడు లేక గతిస్తున్న ప్రాణి

తరువు తెగి మోడు తేలిన వనం

కాలం తప్పి వీస్తున్న పవనం

చేతులారా మోసుకొచ్చిన ఆపద

ఇదేనా నువ్వందించే వారసత్వ సంపద?

 

మేటేసిన ఇసుక దిబ్బలు

కోటలకై పోయాయి..

కొట్టేసిన తరువు ముక్కలు

ఇంటిలో ఒదిగిపోయాయి..

ద్రవ్యం దాహాన్ని తీర్చగలదా?

భవనం చిగురించగలదా?

 

పుష్పాల సుగంధం పొగచూరుకుంది

పక్షులతో చెట్టుబంధం తెగిపోయింది!

చినుకు రాల్చని ఆకాశాన్ని చూస్తూ

విత్తనాలు భూమిలో వట్టిపోతున్నాయి!

గాలి మూలిగిన జాడలలో

నీ వారసత్వం ఊపిరి వెతుకుతాది..!

 

కొండలలో ధూళి మేఘాలు

వాన చినుకుల్లో విషం

నీ అడుగుల జాడలు చూస్తే

కానలలో ఎడారి అగుపిస్తాది!

ఏటి పాయలలో ఇంకిన నీరు

కంటి లోపల ఊరుతాది..!

 

అదే నేల… అదే గాలి…

కానీ నీ తరం వాసన

పెనుభూతంలా వెంటాడుతుంది

నీ నిర్లక్ష్యం తరువాత శ్వాసలో…

 

అయినా ఆశిస్తున్నాం

ఒక రోజు…నువ్వు మేల్కొంటావని!

అప్పుడు చెప్పు..

నీ తరువాత తరానికి

ఏమిస్తున్నావో..!

– ఫణి మండల

8555988435

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button