Just Lifestyle

Blood Group: సేమ్ బ్లడ్ గ్రూప్‌కు, పిల్లలు పుట్టడానికి సంబంధం ఉందా?

Blood Group:మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే.. మరి మాకు పిల్లలు పుట్టరా?" వంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది పెద్దలు కూడా ఇలా మాట్లాడటం వింటూ ఉంటాం.

Blood Group:ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకేలా ఉంటే పిల్లలు పుట్టరు అనే మాట చాలా సార్లు వినిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు, మీ పార్ట్‌నర్ ఇద్దరూ ‘A+’ లేదా ‘O+’ బ్లడ్ గ్రూప్ అయితే, “అయ్యో, పిల్లల సంగతేంటి?” అని కంగారు పడుతుంటారు.

Blood Group

కానీ, డాక్టర్లు ఈ మాటను గట్టిగా ఖండిస్తున్నారు. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న జంటలకు పిల్లలు పుట్టడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని క్లియర్‌గా చెబుతున్నారు. అంటే ఒకే బ్లడ్ గ్రూప్ – పిల్లలు పుట్టడం కష్టం? ఇది పచ్చి అబద్ధం అన్నమాట.

ఎందుకంటే, మన బ్లడ్ గ్రూప్ (A, B, AB, O) అనేది వీర్యం (Sperm) లేదా అండం (Egg)పై ఎలాంటి ప్రభావం చూపదు. అవి గర్భం దాల్చడం లేదా బిడ్డ ఎదుగుదలకు అస్సలు అడ్డంకి కావు. సో, ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్లు.

మరి అసలు సమస్య ఎక్కడ అంటే సమస్యంతా మన బ్లడ్ గ్రూప్ (A, B, AB, O) వల్ల కాదు, Rh ఫ్యాక్టర్ అనే దాని వల్ల! Rh ఫ్యాక్టర్ అంటే రక్తంలో ఉండే ఒక చిన్న ప్రోటీన్. ఇది ఉంటే Rh-పాజిటివ్ (Rh+), లేకపోతే Rh-నెగటివ్ (Rh-) అంటారు.

Rh ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుంది?
ఈ సమస్య కేవలం ఒక్క సందర్భంలోనే వస్తుంది: భార్య బ్లడ్ గ్రూప్ Rh-నెగటివ్ అయి, భర్త బ్లడ్ గ్రూప్ Rh-పాజిటివ్ అయినప్పుడు. అప్పుడు పుట్టబోయే బిడ్డకు ఒకవేళ Rh-పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే (ఇది తండ్రి నుండి వస్తుంది), తల్లి శరీరం ఆ బిడ్డ రక్తాన్ని తన శరీరానికి ‘అపరిచితుడి’గా చూస్తుంది. అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా రక్షణ కణాలను (antibodies) తయారు చేయడం మొదలుపెడుతుంది.

సాధారణంగా మొదటి ప్రెగ్నెన్సీలో పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే ఆ రక్షణ కణాలు తయారవ్వడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ రెండోసారి లేదా ఆ తర్వాత గర్భం దాల్చినప్పుడు, తల్లి శరీరంలో ఉన్న ఆ రక్షణ కణాలు బిడ్డ ఎర్ర రక్త కణాలను పాడు చేయడం మొదలుపెడతాయి. దీన్నే Rh ఇన్‌కంపాటిబిలిటీ అంటారు.

దీని వల్ల బిడ్డకు రక్తహీనత, కామెర్లు లేదా కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. ఈ రోజుల్లో ఈ సమస్యను ఈజీగా ట్రీట్ చేయొచ్చు. Rh-నెగటివ్ గర్భిణీ స్త్రీలకు యాంటీ-డి ఇంజెక్షన్ ఇస్తారు. ఇది ఆ రక్షణ కణాలు తయారు కాకుండా ఆపుతుంది. అందుకే, పెళ్లికి ముందే Rh ఫ్యాక్టర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డాక్టర్లు కూడా పెళ్లికి ముందు బ్లడ్ టెస్టులు చేయించుకోమని గట్టిగా చెప్తున్నారు. ఇది కేవలం Rh ఫ్యాక్టర్ కోసమే కాదు, భవిష్యత్తు జీవితానికి, ముఖ్యంగా పిల్లల హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది. Rh ఫ్యాక్టర్ చెకింగ్ వల్ల తల్లి Rh-నెగటివ్, తండ్రి Rh-పాజిటివ్ అయితే, బిడ్డ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే తెలుసుకోవచ్చని అంటున్నారు.

(చిన్న నోట్: ఈ ఆర్టికల్ కేవలం అవగాహన కోసం. ఈ విషయాలలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, దయచేసి డాక్టర్లను కలవండి.)

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button