Telangana:తెలంగాణ బీజేపీలో మళ్లీ రగులుకున్న కోల్డ్ వార్
Telangana: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్(Bandi Sanjay) చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి

Telangana: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్(Bandi Sanjay) చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలను మళ్లీ బయటపెడుతూ, నాయకులు, కార్యకర్తల మధ్య చిచ్చు రగిల్చాయి. దీంతో ఇది సాధారణ అలజడి కాదు, పార్టీ భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకం రేపుతోందని పార్టీ వర్గాలలో గుబులు మొదలయింది.
Cold war flares up again in Telangana BJP
ఈటల రాజేందర్(Etela Rajender) బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బలమైన నాయకుడు. ఆయనకు మాజీ మంత్రిగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో విజేతగా బలమైన ప్రజాదరణ ఉంది. బండి సంజయ్ బీజేపీలోనే ఎదిగి, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. వీరిద్దరూ తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన ముఖాలే. వీరిద్దరి మధ్య నాయకత్వ పోరు ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.
“పాత వర్సెస్ కొత్త అనే కాన్సెప్ట్‌తోనే .. ఈటల వంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, బండి సంజయ్ వంటి బీజేపీలోనే దీర్ఘకాలంగా ఉన్న నాయకుల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతుంటారు. “అవుట్‌సైడర్స్” పట్ల బండి సంజయ్ వైఖరిపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కొన్ని నివేదికల ప్రకారం, వీరిద్దరి మధ్య విభేదాలకు కులపరమైన అంశాలు కూడా కారణం కావచ్చని అంచనా. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజిక వర్గాలు తెలంగాణలో బలమైన బీసీ వర్గాలు
అయితే తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతోనే వీరిద్దరి అసలు కథ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా హుజూరాబాద్(Huzurabad)లో కొందరు బీజేపీ నాయకులే పనిచేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు, అక్కడి స్థానిక బీజేపీ శ్రేణులను తీవ్రంగా కలిచివేశాయి. దీంతో, శుక్రవారం హుజూరాబాద్‌కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో ఉన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటికి పరుగులు తీశారు.
అంత మంది కార్యకర్తలు ఈటల ఇంటికి రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వారంతా ఈటలకు మద్దతుగా నిలిచారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తాము తీవ్ర ఆవేదనకు గురయ్యామని, స్థానిక బీజేపీ నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని ఈటల దృష్టికి తీసుకెళ్లారు. “తమ భవిష్యత్తు ఏంటి? తాము బీజేపీలో కొనసాగాలా వద్దా?” అంటూ తమ ఆవేదనను ఈటల రాజేందర్ ముందు వెళ్లగక్కారు.
నిజానికి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల మధ్య గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్నాయన్న గుసగుసలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వం, పార్టీ వ్యూహాల విషయంలో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఈటలకు కార్యకర్తల మద్దతు.. ఈ అంతర్గత ‘కోల్డ్ వార్’ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.
ఈ పరిణామం తెలంగాణ బీజేపీకి కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి, ఇలాంటి అంతర్గత విభేదాలు ఎదుగుదలకు అవరోధంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిచ్చు చల్లారుతుందా, లేక మరింత పెద్ద అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుందా అనేది వేచి చూడాలి. పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుంది, నాయకుల మధ్య సయోధ్య కుదురుస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.