Durgamma Temple
భగవంతుని సన్నిధి అంటేనే భక్తులకు ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తారు. తమ కష్టాలను తీర్చమని వేడుకోవడానికే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా కోట్లాది మంది భక్తులు పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు.
కానీ, దురదృష్టవశాత్తూ అలాంటి పవిత్ర పుణ్య స్థలాలను కొందరు స్వార్థపరులు, దళారులు, సిబ్బంది తమ అక్రమ సంపాదనకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. తిరుమల ఏడుకొండలవాడి సన్నిధి నుంచి ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం(Durgamma Temple) వరకు ఎక్కడికక్కడ టికెట్ల గోల్‌మాల్, వీఐపీ దర్శనాల పేరుతో ఇలా రోజుకో దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
పొలిటికల్‌గా, సామాజికంగా సొసైటీలో నైతిక విలువలు పడిపోవడంతోనే ఇలాంటి ఘోరాలు జరగడానికి మెయిన్ రీజన్‌గా నిలుస్తుంది. తప్పు చేస్తే పాపం చుట్టుకుంటుందనే కర్మ సిద్ధాంతాన్ని, భయాన్ని కొంతమంది పూర్తిగా మరిచిపోతున్నారు. డబ్బులు సంపాదిస్తే చాలు, ఏ దారిలో వచ్చినా పర్లేదనే ధనవ్యామోహం మనుషుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. దేవస్థానాల పర్యవేక్షణ లోపాలు, టెక్నాలజీలో లూప్ హోల్స్ ఇలాంటి వారికి వరంగా మారుతోంది.
తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై బయటపడిన టికెట్ల రీసైక్లింగ్ దందా దీనికి పెద్ద ఉదాహరణ. భక్తులు కొనుగోలు చేసిన రూ.100, రూ.500 దర్శన టికెట్లను చెక్ పోస్టుల వద్ద కలెక్ట్ చేసుకుంటున్న కొంతమంది .. వాటి కౌంటర్ ఫాయిల్స్‌ను భక్తులకు తిరిగి ఇవ్వకుండా ఉంచడమే కాకుండా వాటిని స్కాన్ కూడా చేయకుండా దాచిపెట్టి.. మళ్లీ వాటిని వేరే భక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదంతా కొంతమంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అలాగే కొందరు దుర్గమ్మ ఆలయంలో(Durgamma Temple) ఉండే సిబ్బంది కుమ్మక్కై చేస్తున్న వ్యవహారంగా తేలింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, టికెట్లను కంపల్సరీ స్కాన్ చేసే నిఘా వ్యవస్థ లేకపోవడం, లైవ్ మానిటరింగ్ లోపించడం వల్ల ఇలాంటి అక్రమాలు సాధ్యమవుతున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు, ప్రత్యేక ప్యాకేజీల పేరుతో దళారుల దోపిడీ కూడా ఎక్కువైంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు క్యూలైన్లు, దర్శన సమయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని దశాబ్దాలుగా ఆలయ పరిసరాల్లోనే తిష్టవేసిన కొన్ని ముఠాలు.. పార్కింగ్ దగ్గరి నుంచే భక్తులను బుట్టలో వేసుకునే పనిలో పడుతున్నాయి.
తామే దర్శనం చేయిస్తామని.. కార్ పార్కింగ్ చూసుకుంటామని చెబుతూ వేల రూపాయలు వసూలు చేసి, లోపల ఉన్న ఉద్యోగుల సాయంతో క్యూలైన్లను మేనేజ్ చేస్తూ అక్రమ దర్శనాలు చేయిస్తున్నారు. దేవాలయ అధికారులు ఇలాంటివి చూసీచూడనట్లు వదిలేయడం, అలాగే కొన్నిసార్లు ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని వదిలేయడం వంటి చర్యల వల్ల ఈ ముఠాల ఆటలు సాగుతున్నాయి.
ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే కేవలం ఉద్యోగులను మార్చడం లేదా హోంగార్డులను తొలగించడం మాత్రమే సరిపోదు. వ్యవస్థలోనే సమూలంగా మార్పులు రావాలి. డిజిటల్ సిస్టమ్స్ మరింత స్ట్రాంగ్ కావాలి. ఒకసారి వాడిన టికెట్ మళ్లీ ఏ రూపంలో కూడా లోపలికి వెళ్లకుండా కఠినమైన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ట్రాకింగ్ అనేది మస్ట్‌గా ఉండాలి.
అలాగే, భక్తులలో కూడా దళారులను నమ్మి మోసపోకూడదనే స్పృహ పెరగాలి. దేవుడి సొమ్మును దోచుకునే వారిపై పోలీసులు,చట్టం ఉక్కుపాదం మోపినప్పుడే.. ఇంద్రకీలాద్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల పవిత్రత, భక్తుల నమ్మకం పెరుగుతాయి.
OTT : ఈ వారం ఓటీటీ, థియేటర్లలో జాతర.. ఏకంగా 20కి పైగా చిత్రాలు, సిరీస్‌లు..
