Srisailam
వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పంటలు పండకపోవడంతో.. ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాలలోని అన్నదాతలకు.. కృష్ణా నది ప్రవాహాలు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయనే చెప్పాలి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాలైన ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు వర్షాల వల్ల.. నిండుకుండలా మారడంతో అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ఈ నీటి ప్రవాహం జూరాల ప్రాజెక్టు మీదుగా.. శ్రీశైలం(Srisailam) జలాశయం వైపు వేగంగా తరలివస్తోంది. ఇప్పటికే జూరాల వద్ద విద్యుత్ ఉత్పాదన ద్వారా కరెంట్ తయారుచేస్తూనే, మిగిలిన నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలానికి(Srisailam) చేరుకుంటూ ఉండటంతో.. రాయలసీమతో పాటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతుండటం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో జూన్, జూలై మాసాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సగానికి పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వర్షపాత లోటు రికార్డ్ అయింది. చల్లిన విత్తనాలు కూడా సరిగా మొలకెత్తక, నాగలి పట్టి పొలం దున్నలేక రైతాంగమంతా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అయితే ఇప్పుడు కురుస్తున్న వానలతో పాటు ఎగువ నుంచి వస్తున్న ఈ భారీ ప్రవాహాలు ఖరీఫ్ సీజన్ సాగుకు జీవనాధారంగా మారనున్నాయి.
స్థానికంగా కురిసే వర్షాలు రిజర్వాయర్లను నింపడానికి సరిపోకపోయినా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ వరద నీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కొరతను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడబోతోంది. కృష్ణా నదికి జలకళ రావడంతో తెలుగు రాష్ట్రాలలోని రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Moringa Powder : ప్రకృతి ప్రసాదించిన న్యూట్రిషన్ పవర్‌హౌస్ ..సూపర్ ఫుడ్‌గా మునగాకుల పొడి
