Pawan Kalyan
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పైకి చూడటానికి ఇది కేవలం టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు తేలక జరిగిన పంచాయితీలా అనిపించొచ్చు కానీ, లోతుగా పరిశీలిస్తే దీని వెనుక పెద్ద పొలిటికల్ స్టోరీనే నడుస్తోంది.
ఇటు సొంత పార్టీ కేడర్ అసంతృప్తి, అటు టీడీపీలోని కొంతమంది నేతల ఆధిపత్య ధోరణి, మరోవైపు కూటమి పార్టీకి పెట్టిన మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్న వైఎస్సార్సీపీ నేతలు.. ఇలా ఒకేసారి ముగ్గురు ప్రత్యర్థులతో ఈ స్థానిక పోరులో పవన్ తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కేడర్ అసంతృప్తి.. పొత్తు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా సర్దుబాట్లు తప్పవు. కానీ, క్షేత్రస్థాయిలో తమ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన జనసైనికులకు తగిన గుర్తింపు దక్కనప్పుడు, సీట్లు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి వారికైనా నిరాశ వ్యక్తమవుతుంది.
టీడీపీకి పవన్ పదేపదే తలొగ్గుతున్నారనే ఫీలింగ్ సొంత కేడర్లోనే ఎక్కువయితే, అది పార్టీ పునాదులనే కదిలిస్తుంది. తమ కేడర్‌కు కేవలం మాటలతో ధైర్యం చెప్పడం సరిపోదు, వారికి అధికారంలో, స్థానిక సంస్థల్లో తగిన ఇంపార్టెన్స్ దక్కేలా చేయడం పవన్ ముందున్న మొట్టమొదటి సవాల్.
టీడీపీలోని ఆధిపత్య ధోరణి , ఈగో రాజకీయాలు.. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటో కూటమి నేతలకే కాదు ఏపీ ప్రజలందరికీ తెలుసు. అయితే, క్షేత్రస్థాయిలో టీడీపీకి ఉన్న సుదీర్ఘ చరిత్ర, సంస్థాగత బలం, ఓటు బ్యాంక్ బలమైనవే అయినా.. జనసేన ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ పవన్‌కు ప్రయారిటీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ బలం పెరిగితే ఫ్యూచర్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనతో ఈగోలు పెంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.
వైసీపీ రాజకీయ వ్యూహాలు , కుట్రలు.. కూటమిలో చిన్న విభేదం వచ్చినా సరే, వాటిని భూతద్దంలో చూపించి పెద్ద రచ్చ చేయడానికి వైసీపీ కాచుకుని కూర్చుని ఉంటుంది. పవన్‌ను టీడీపీ అణచివేస్తోంది, జనసేనను చిన్నచూపు చూస్తున్నారు, పవన్, లోకేష్ మధ్య పెరుగుతున్న గ్యాప్ అంటూ ప్రచారాలు చేస్తూ, కూటమి మధ్య చిచ్చు పెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నెరేటివ్‌ను తిప్పికొట్టడం పవన్ ముందున్న మరో పెద్ద సవాల్.
టీడీపీ – జనసేన పార్టీలు జనసేనాని ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయనే విషయంపై టీడీపీ కోణం చూస్తే.. ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీలో.. తమ నియోజకవర్గాల్లోనే తమ పార్టీకి, సామాజిక వర్గానికి చెందని ఓ వ్యక్తి.. మరో శక్తిగా ఎదుగుతుంటే..తమ రాజకీయ భవిష్యత్తుపై కొందరిలో భయం ఉంటుంది. కూటమి గెలుపు మాత్రమే ముఖ్యమనుకునే నాయకులు ఒకవైపు ఉంటే, టీడీపీ పట్టు జారిపోతుందనే ఆందోళన చెందే వర్గం మరోవైపు ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం సీఎం చంద్రబాబుకు కూడా కష్టమవుతోంది.
ఇదే విషయాన్ని జనసేన కోణంలో చూస్తే.. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్‌పైనే నడుస్తున్న పార్టీని, గ్రామస్థాయిలో బలమైన సంస్థాగత శక్తిగా మార్చే జర్నీలో ఈ పొత్తుల ఒత్తిళ్లు అధిష్టానానికి అడ్డంకిగా మారుతున్నాయి. కార్యకర్తల ఆశలు, కూటమి అవసరాలను బ్యాలెన్స్ చేయడంలో కొన్నిసార్లు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోంది.
అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు కావాల్సింది తెలుగు దేశం పార్టీతో యుద్ధం చేయడం కాదు.. అలా అని రాజీ పడి పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ను తాకట్టు పెట్టడం అంతకంటే కాదు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను కేవలం సీట్ల సర్దుబాటుగా మాత్రమే చూడకుండా, జనసేనకు క్షేత్రస్థాయిలో ఎంత పట్టుందో నిరూపించే సదవకాశంగా మలచుకోవాలి. ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో, అక్కడ పక్కా ప్లాన్‌తో కచ్చితంగా గెలిచి తీరాలి.
అలాగే సీఎం చంద్రబాబు అనుభవాన్ని గౌరవించడంతో పాటు అదే సమయంలో జనసేన ప్రయోజనాల విషయంలో ప్రైవేట్‌గా స్పష్టమైన డిమాండ్లను ఆయన ముందు ఉంచాలి. మీడియా ముందు కూటమి ఐక్యతను చాటాలి. అదే విధంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ జనసేన ఆత్మగౌరవానికి తాను భంగం కలగనివ్వబోననే సంకేతాన్ని మాత్రం బలంగా పంపాలి.
మొత్తంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) టీడీపీని ఓడించి ఎదగాల్సిన అవసరం అస్సలు లేదు. అదే సమయంలో టీడీపీ నీడలోనే రాజీ పడి రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కూటమిలో గౌరవప్రదమైన పార్ట్నర్గా ఉంటూనే, జనసేనను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చడమే పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక పవర్ ఫుల్ అస్త్రం.
Heart Attack : గుండెపోటు లక్షణాలు మగవారిలో, మహిళలలో వేరువేరుగా ఉంటాయని తెలుసా? ఆ సమయంలో ఏం చేయాలి?
