AP : ఏపీలో ఎండల సెగ.. ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

AP : విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

AP

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఏపీ(AP) వ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టెంపరేచర్‌ 44 డిగ్రీల సెల్సియస్ దాటి పోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ వాసులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రేపు అంటే ఏప్రిల్ 27న ఏపీలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ముఖ్యంగా ఏపీ(AP)లోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గణాంకాల ప్రకారం 16 జిల్లాల్లోని దాదాపు 198 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా కంభంలో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయి.. రికార్డును కూడా సృష్టించింది. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

AP

రోజురోజుకు ఎక్కువవుతున్న ఎండల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని కోరుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ధరించడం, సన్ గ్లాసెస్ వాడటం వంటివి తప్పనిసరిగా చేయాలని అంటున్నారు. అంతేకాదు శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలని.. దీనికోసం మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి లిక్విడ్స్‌ను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు.

ముఖ్యంగా పెద్దవాళ్లు, చిన్నపిల్లలు , దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన బీపీ, షుగర్, గుండె జబ్బులున్నవారు ఈ ఎండల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి గర్భిణీలు , అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

AAP : ఆ ఎంపీలకు ఆప్ బిగ్ షాక్..అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

Exit mobile version