BR Naidu
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో తలదూర్చినా ప్రత్యర్థులకు టార్గెట్ అయిపోతుంటారు. అది వ్యక్తిగత జీవితంలో వ్యవహారమైనా, వివాదమైనా సరే ప్రత్యర్థులకు తమకు తామే స్వయంగా అస్త్రాలు అందించినట్టే.
ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదే తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. వాటిని అమలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కొన్నింటిని అమలు చేసింది కూడా. ఇదే క్రమంలో ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబుతో సహా కీలక నేతలు బాగానే కష్టపడుతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కొంతమంది నేతల వ్యక్తిగత వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయాయి. మొన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్.. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)మరొక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు.. కూటమి సర్కారుకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
బీఆర్ నాయుడు(BR Naidu) సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.. ఒక టీవీ ఛానల్ అధినేతగా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఏదో తన వంతుగా చాలా కృషి చేశారు. దానికి ప్రతిఫలంగానే చంద్రబాబు ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. కలియుగ ప్రత్యక్షదైవంగా కీర్తించబడే తిరుమలకు ఉన్న ప్రత్యేకత వల్ల టీటీడీ బాధ్యతలు చేపట్టే వ్యక్తి చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.
గతంలో ఎలా ఉన్నా టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు అంటే పబ్లిక్ దృష్టిలో చాలా పవిత్రంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు కాబట్టి వివాదాల్లో చిక్కుకోకూడదు. కానీ బీఆర్ నాయుడుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో ఇంకా నిజనిజాలు నిర్థారించలేకపోయినా మరొక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది ఏఐతో మార్ఫింగ్ చేసారని, దీనిపై సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫిర్యాదు చేసినట్టు బీఆర్ నాయుడు(BR Naidu) చెబుతున్నారు. అయితే వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ నాయుడుని కామనాయుడిగా సంబోధిస్తూ, ఆయనను వెంటనే టీటీడీ ఛైర్మన్ గా తొలగించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ నాయుడు వ్యక్తిగత జీవితంపై తనకు అభ్యంతరాలు లేవన్న కరుణాకర్ రెడ్డి పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉంటూ మరొక మహిళతో ఇలా సన్నిహితంగా ఉండడం కచ్చితంగా అభ్యంతరకరమేనని మండిపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఇది మరో అస్త్రంగా మారే అవకాశముంది.
ఇప్పటికే లడ్డూలో నెయ్యి కల్తీ అంశం కూడా రాజకీయపరమైన అంశంగా మారిపోయింది. తాజాగా బీఆర్ నాయుడు వీడియో వ్యవహారం కూడా సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై చంద్రబాబు ఎలా ముందుకెళతారనేది చూడాలి. మొత్తం మీద పాలనాపరమైన అంశాల కంటే కూడా నేతల వ్యక్తిగత వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
