Online Payments
ఏదైనా టికెట్ బుక్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు కానీ పేమెంట్ పేజీకి వచ్చిన వెంటనే మన ముందు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ , క్రెడిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్, సీఓడీ ఇలా ఏది క్లిక్ చేసినా క్షణాల్లో పని పూర్తయిపోతుంది.
అయితే ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ పేమెంట్స్(Online Payments) కోసం సోషల్ మీడియాలో కొన్ని డౌట్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి యూపీఐపై ఎండీఆర్ రూల్స్ అమల్లోకి వస్తే అకౌంట్ నుంచి ఎక్స్‌ట్రా డబ్బులు కట్ అవుతాయా అని.. క్రెడిట్ కార్డ్ వాడినపుడు ఈ బాదుడు ఉంటుందా అని అలాగే నెట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏంటి అని అంతేకాకుండా.. అసలు మన జేబు నుంచి అదనపు డబ్బులు ఎప్పుడు, ఎలా బయటకు వెళ్తాయి అని రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ముందుగా మనందరం రోజూ వాడే యూపీఐ విషయం చూస్తే .. అక్టోబర్ 15 వ తేదీ నుంచి రూ.2,000 దాటిన కొన్ని రకాల బిజినెస్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ రుసుము అమల్లోకి రాబోతోంది. అయితే ఇక్కడ దాగున్న విషయం ఏంటంటే.. ఈ డబ్బులను కేవలం మర్చంట్ మాత్రమే చెల్లించాలి తప్ప, వస్తువు కొన్న కస్టమర్ నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదు.
ఉదాహరణకు మీరు ఒక షాప్‌లో రూ.5,000 విలువైన వస్తువు కొని యూపీఐ ద్వారా పే చేస్తే, మీ అకౌంట్ నుంచి రూ.5,000 మాత్రమే కట్ అవుతాయి. ఎండీఆర్ పేరుతో రూ.40 ఎక్స్‌ట్రాగా మీ అకౌంట్ నుంచి పోవు. రూ.75,000 దాటిన భారీ ట్రాన్సాక్షన్లలో ఈ ఎండీఆర్ ఛార్జీ గరిష్టంగా రూ.300 దాటదు. పైగా మీ ఫ్రెండ్స్‌కి లేదంటే తెలిసిన వాళ్లకు చేసే డైరెక్ట్ యూపీఐ ట్రాన్స్‌ఫర్లకు ఈ ఎండీఆర్ రూల్ అసలు వర్తించనే వర్తించదు.
ఇక క్రెడిట్ కార్డ్ వాడేవాళ్ల పరిస్థితి కూడా సుమారు ఇంతే. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మీద కూడా ఈ ఎండీఆర్ వర్తిస్తుంది కానీ, అది కూడా మర్చెంట్ లేదా సర్వీస్ ప్రొవైడర్ చెల్లిస్తారు. మీరు రూ.5,000ల ప్రాడక్ట్ కొంటే క్రెడిట్ కార్డ్ నుంచి రూ.5,000 మాత్రమే స్వైప్ అవుతాయి. ఆ కార్డ్ స్వాపింగ్ మిషన్ సర్వీస్ వాడుకుంటున్నందుకు మర్చెంట్ బ్యాంక్‌కి ఎండీఆర్ కడతాడు.
అయితే ఇక్కడ కస్టమర్లు గమనించాల్సిన ఒక విషయం ఉంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు కానీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినప్పుడు స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు అని అదనంగా మనీని యాడ్ చేయొచ్చు. అలాగే కార్డ్ బిల్లును టైమ్‌కి కట్టకపోతే పడే లేట్ ఫీజులు, వడ్డీలు అనేవి బ్యాంక్ కండీషన్లు మాత్రమే. వాటికీ ఎండీఆర్‌కి అసలు సంబంధమే ఉండదు.
ఇక నెట్ బ్యాంకింగ్‌ది కాస్త డిఫరెంట్ సిచ్యువేషన్. మన సేవింగ్స్ అకౌంట్ నుంచి నెఫ్ట్( NEFT) ద్వారా డైరెక్ట్‌గా డబ్బులు పంపిస్తే బ్యాంకులు ఎలాంటి ఛార్జెస్ వేయవు. కానీ మూవీ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు లేదా ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకుంటే.. ఆ బుకింగ్ ప్లాట్‌ఫామ్ స్పెషల్‌గా పేమెంట్ లేదా సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఫ్రీ లేదా ఫీజు అనే మ్యాటర్ ప్లాట్‌ఫామ్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే.. ఎండీఆర్ అనేది కేవలం వ్యాపారి జేబు నుంచి పోయే ఖర్చు మాత్రమే.. అయితే కన్వీనియన్స్ ఫీజు, బుకింగ్ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు అనేవి మాత్రం కస్టమర్ జేబు నుంచి కట్ అయ్యే ఛార్జీలు అన్నమాట. ఉదాహరణకు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు మీరు యూపీఐ వాడినా, క్రెడిట్ కార్డ్ వాడినా కూడా ఒకే రకమైన కన్వీనియన్స్ ఫీజు పడొచ్చు. అదే వేరే సైట్‌లో యూపీఐకి ఫ్రీ ఇచ్చి, నెట్ బ్యాంకింగ్‌కి మాత్రం రూ.10 ఎక్స్‌ట్రాగా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. .
అందుకే యూపీఐ మాత్రం ఫ్రీ.. క్రెడిట్ కార్డ్ ఖరీదు.. నెట్ బ్యాంకింగ్ వేస్ట్ అని ఎవరూ కూడా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోవద్దు. ఆన్‌లైన్‌లో ఏది కొన్నా కూడా ఆఖరున ఫైనల్ పేమెంట్ బటన్ నొక్కడానికి ముందు అసలు బిల్లు ఎంత అయింది? ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏమైనా యాడ్ అవుతున్నాయా? అని ఒక్క క్షణం చెక్ చేసుకుని ప్రొసీడ్ అవడమే .. మన డబ్బును కాపాడుకునే తెలివైన మార్గం అని గుర్తించాలి.
