Gold
రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు రోజులుగా పుత్తడి పరుగు కొనసాగుతుండటంతో, కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో శుభకార్యాల కోసం గోల్డ్ కొనాలనుకునే వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న అనిశ్చిత పరిణామాలు, రూపాయి విలువలో మార్పులు స్థానిక మార్కెట్లపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సోమవారం నుంచి మొదలైన ఈ పెరుగుదల గురువారం రోజుకి మరింత గరిష్ట స్థాయికి చేరుకుంది.
హైదరాబాద్‌లోని మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, బుధవారం ధరతో పోలిస్తే ఈరోజు పసిడి (Gold ) మరింత పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర దాదాపు 220 రూపాయలు పెరిగి 1,55,570 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అదే విధంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా 200 రూపాయల వరకూ పెరిగి 1,42,600 రూపాయలకు చేరుకుంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరులోనూ సుమారు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం(Gold ) ధరలు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అక్కడ 24 క్యారెట్ల పుత్తడి ధర 1,55,720 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,42,750 రూపాయలుగా నమోదైంది. అటు చెన్నైలో కూడా ధరల పెంపు కొనసాగుతోంది.
అక్కడ 24 క్యారెట్ల బంగారం 1,56,230 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర 1,43,210 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని మెయిన్ సిటీలలోనూ బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.
కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ ధరలు కూడా సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ , చెన్నై నగరాల్లో కిలో వెండి ధర 100 రూపాయల వరకూ పెరిగి 2,75,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా సుమారు ఇదే స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. అక్కడ కిలో వెండి 2,70,100 రూపాయలుగా కొనసాగుతోంది.
ఒకవైపు పెళ్లిళ్ల సందడి, మరోవైపు ఆకాశాన్నంటుతున్న ధరల వల్ల వినియోగదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు కుదుటపడితే తప్ప బంగారం ధరలు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
