Brazil nuts
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారాలలో బ్రెజిల్ నట్స్(Brazil nuts) ముందు వరుసలో ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అమెజాన్ అడవులలో పెరిగే భారీ వృక్షాల నుంచి బ్రెజిల్ నట్స్ లభిస్తాయి. చూడటానికి పెద్ద సైజు బాదం పప్పుల్లా కనిపించే ఈ గింజలు కేవలం రుచికరమైనవే కాదు, పోషకాల గని కూడా అని చాలామందికి తెలియదు.
ముఖ్యంగా బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలీనియం అనే ఖనిజం.. ప్రపంచంలోనే మరే ఇతర ఆహార పదార్థంలోనూ లేనంత ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపరచడానికి , అలాగే మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సెలీనియం ఎంతో అవసరం పడుతుంది. రోజుకు ఒకటి కానీ రెండు కానీ గింజలు తింటే చాలు.. మన శరీరానికి కావాల్సిన సెలీనియం పుష్కలంగా అందుతుంది.
బ్రెజిల్ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. బాదాం పప్పులు నానబెట్టినట్లే వీటిని కూడా నానబెట్టి పరగడపున తినాలి. బ్రెజిల్ నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని అరికడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చేయడంలో కూడా ఇవి కీ రోల్ పోషిస్తాయట.
అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు వీటిని రోజూ తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా బ్రెజిల్ నట్స్‌లోని విటమిన్-ఇ సహాయపడుతుంది.
అయితే బ్రెజిల్ నట్స్(Brazil nuts) విషయంలో మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ గింజలు రుచిగా ఉన్నాయని అమితంగా తింటే విషంతో సమానం అన్నట్టుగా మారతాయట. అందుకే బ్రెజిల్ నట్స్‌ను అతిగా తినకూడదు. దీనిలో సెలీనియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజుకు 4-5 కంటే ఎక్కువ గింజలు తింటే శరీరంలో సెలీనియం టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుందట.
శరీరంలో సెలీనియం టాక్సిసిటీ వల్ల జుట్టు రాలడం, గోళ్లు విరిగిపోవడంతో పాటు జీర్ణకోశ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇబ్బందులు కలగొచ్చు. కాబట్టి రోజుకు కేవలం ఒకటి సరిపోతుంది. మహా అనుకుంటే రెండు గింజలు మాత్రమే తినాలి. ఇలా సరైన మోతాదులో బ్రెజిల్ నట్స్ తీసుకుంటే..ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి.
