Coconut Water
వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నప్పుడు మన బాడీకి తక్షణ శక్తిని , రిలీఫ్‌ను ఇచ్చే సహజ పానీయం కొబ్బరి నీళ్లు(Coconut Water) అని అంతా వీటిని తాగడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది సౌకర్యం కోసం, చల్లగా ఉండటం కోసం కొబ్బరి బొండం నుంచి నీటిని తీసి బాటిళ్లలో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అసలు కొబ్బరి నీళ్లను ఎంతకాలం నిల్వ చేయొచ్చో, అవి పాడయ్యాయని ఎలా గుర్తించాలనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు.
సాధారణంగా కొబ్బరి బొండం పైన ఉండే గట్టి సహజ కవచం లోపల ఉన్న నీటికి ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ఒక్కసారి బొండం కొట్టిన తర్వాత అందులోని నీరు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరపడం ప్రారంభిస్తుంది. దీనివల్ల నీటిలో ఉండే ఎంజైమ్‌లు యాక్టివేట్ అవడంతో ఆక్సీకరణ ప్రక్రియ జరగడం ద్వారా రుచితో పాటు రంగు కూడా మారిపోతాయి. నార్మల్ టెంపరేచర్ వద్ద బయట ఉంచితే కొబ్బరి నీళ్లు కేవలం 3 నుంచి 4 గంటల్లోనే పాడవ్వడం మొదలవుతుంది.
ఒకవేళ కొబ్బరి నీటిని నిల్వ చేయాలనుకుంటే స్టీల్, ప్లాస్టిక్ పాత్రల కంటే గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లు 5-6 గంటల వరకు మాత్రమే రుచిగా ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితులలోనూ 10 గంటల తర్వాత వాటిని తాగడం అసలు ఆరోగ్యకరం కాదు. నీళ్లు కాస్త తెల్లగా కానీ, మబ్బుగా మారినా కానీ, పుల్లటి వాసన వచ్చినా, రుచిలో మార్పు ఉన్నా అవి ఎక్స్‌పైర్ అయినట్లు అర్థం చేసుకోవాలి.
అయితే కొని తాగే ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ల(Coconut Water)లో నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. కానీ నేరుగా బొండం నుంచి వచ్చే నీటిలో ఎటువంటి రసాయనాలుండవు కాబట్టి వాటిని తాగడమే మంచిది. నిల్వ ఉన్న కొబ్బరి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు ఎప్పుడూ తాజా కొబ్బరి నీళ్లనే తీసుకోవడం మంచిది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ అమృతాన్ని కొబ్బరి బొండం నుంచి తీసిన వెంటనే తాగడం వల్ల పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి.
Government Services:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు.. డిజిటల్ విప్లవం, వాట్సప్ గవర్నెన్స్ వైపు అడుగులు
