Jaggery
తెలుగిళ్ళల్లో పండగ వచ్చిందంటే చాలు పిండి వంటలు, నైవేద్యాలతో మన ఆడపడుచులు దేవుళ్లకు ప్రసాదాలు వండి వడ్డిస్తుంటారు. ఈ క్రమంలో చక్కెర కంటే ఎక్కువగా బెల్లం(Jaggery) ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని మన తాతల కాలం నుంచీ ఉంది. చక్కెరతో పోలిస్తే బెల్లం(Jaggery) తినొచ్చని వైద్యనిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే రెగ్యులర్ గా కాకపోయినా పండుగ సమయాల్లో చాలా మంది బెల్లంతోనే స్వీట్లు తయారు చేసుకుంటుంటారు.
బెల్లం హీమోగ్లోబిన్ పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత రోజూ ఒక చిన్న ముక్క బెల్లం తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన బెల్లం దొరకడం కష్టమైపోయింది. పల్లెటూర్లలో పర్వాలేదు గానీ నగరాల్లో మాత్రం కల్తీ లేని బెల్లం ఎక్కడా కనిపించడం లేదు.
మార్కెట్ లో దళారులు స్వలాభం కోసం రసాయనాలు కలిపిన కల్తీ బెల్లం అమ్మేస్తున్నారు. అందుకే సిటీల్లో కొనే బెల్లం రుచి కూడా తేడా ఉంటుంది. అంత తియ్యగా ఉండకపోగా , ఉప్పగా ఉంటుంది. ఈ కల్తీ బెల్లం తింటే లేనిపోని ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే.
అయితే కొన్ని సింపుల్ చిట్కాలు ఉపయోగించి బెల్లం కల్తీని గుర్తించవచ్చు. సహజ బెల్లానికి ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. దాన్ని పగలగొట్టినప్పుడు మృదువైన చెరకు సువాసన వస్తుంది. కానీ కల్తీ బెల్లం అయితే మాత్రం ఎటువంటి వాసన రాదు. ఒకవేళ వాసన రాకుండా దానిపై అనుమానం ఉంటే ఆ బెల్లాన్ని కొనకూడదు.
అలాగే నీటి ద్వారా కూడా బెల్లం కల్తీని కనిపెట్టొచ్చు. కొద్దిగా బెల్లం తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేయండి. నిజమైన బెల్లం గ్లాస్ అడుగు భాగానికి చేరుకుంటుంది. అదే కల్తీ బెల్లం అయితే పైకి తేలుతుంది. ఎందుకంటే ఒరిజినల్ బెల్లం ఎక్కువ స్వచ్ఛత , సాంద్రతను కలిగి ఉంటుంది. ఒకవేళ కెమికల్స్, కృత్రిమ రంగులు కలిపితే కల్తీ బెల్లాన్ని అవి తేలికగా చేస్తాయి.
బెల్లంలో బేకింగ్ సోడా కలిసిందో లేదో చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. పావు టీస్పూన్ పొడి బెల్లం ఒక చిన్న గ్లాసులో వేసి దీనిలో మూడు మి.లీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేయాలి. కొద్దిసేపటి తర్వాత పైకి నురగ వస్తే బెల్లం కల్తీ అయినట్లేనని ధృవీకరించుకోవచ్చు. ఒకవేళ నురగ రాకుంటే స్వచ్ఛమైన బెల్లంగా చెబుతున్నారు.
