Jaggery Ginger Tea
రెయినీ సీజన్ వచ్చిందంటే చాలు.. వాతావరణంలో వచ్చే అనుకోని మార్పులు, పెరిగే తేమ, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండటం వంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడినపుడు వెంటనే మెడికల్ షాప్‌కి పరిగెత్తి టాబ్లెట్‌లు, సిరప్‌లు వంటివి కొని వాడుతుంటారు.
అయితే వీటన్నిటికి బదులు మన పూర్వీకుల కాలం నాటి పవర్‌ఫుల్ అల్లం, బెల్లం కషాయం(Jaggery Ginger Tea) తాగితే క్షణాల్లో గొంతు హాయిగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ అనే పవర్‌ఫుల్ కాంపౌండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి గొంతు వాపును తగ్గిస్తే, బెల్లం గొంతును చాలా మృదువుగా మారుస్తుంది.
ఈ కషాయాన్ని పర్ఫెక్ట్‌గా చేయాలంటే దీనికోసం ఒక అంగుళం తాజా అల్లం ముక్క, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 2 కప్పుల నీరు సిద్ధం చేసుకోవాలి. ఆప్షనల్‌గా చిటికెడు మిరియాల పొడి, 4 నుంచి 5 తులసి ఆకులు కూడా వాడుకోవచ్చు.
ముందుగా అల్లాన్ని మట్టి లేకుండా బాగా కడిగి తొక్క తీసి మెత్తగా నూరి లేదా తురుముకోవాలి. ఒక పాత్రలో నీరు పోసి దంచిన అల్లం వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. నీరు కొద్దిగా దగ్గరగా అయ్యాక బెల్లం వేసి అది పూర్తిగా కరిగే వరకు కలపాలి. అవసరమైతే మిరియాల పొడి, తులసి ఆకులు వేసి మరో 2 నిమిషాలు మరిగించి, వడగట్టిన తర్వాత తాగగలిగే వారు వేడిగా.. అలా తాగలేం అనుకున్నవాళ్లు గోరువెచ్చగా తాగాలి.
ఈ వేడి కషాయం గొంతులోని శ్లేష్మాన్ని పలుచగా చేసి.. దగ్గు వల్ల కలిగే అసౌకర్యాన్ని, గొంతు చికాకును కొద్ది నిమిషాల్లోనే తగ్గిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్‌కి మంచి సపోర్ట్ ఇస్తాయి. వర్షాకాలంలో చాలామందికి వచ్చే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే అల్లం చిటికెలో వాటిని మాయం చేసి జీర్ణక్రియను బాగా పెంచుతుంది.
ఈ కషాయాన్ని దగ్గు పూర్తిగా తగ్గేవరకూ రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తీసుకుంటే మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం మోతాదు తగ్గించడమో..అసలు బెల్లం వేసుకోకపోవడమో చేయాలి. అలాగే కడుపులో అల్సర్ లేదా తీవ్రమైన అసిడిటీ ఉన్నవారు కూడా ఈ కషాయం తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ ఈ కషాయం తాగినా కూడా గొంతు నొప్పి తగ్గకపోయినా..అలాగే జ్వరం,ఇన్‌ఫెక్షన్ వంటివి మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగితే ఏమాత్రం లేట్ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
