Sesame
నువ్వులు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అని చెప్పొచ్చు. చిన్నగా కనిపించే నువ్వులలో శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ మన ఆహారంలో ఈ గింజలను భాగం చేసుకోవడం వల్ల ఎముకలు , పళ్లు దృఢంగా మారతాయి.
ఎందుకంటే నువ్వులలో(Sesame) కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి విలువైన మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. కేవలం ఎముకలకే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ బాడీలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి, గుండె జబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తాయి.
చాలామందిని వేధించే జీర్ణక్రియ సమస్యలకు కూడా ఇవి మంచి పరిష్కారం చూపుతాయి. వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం వంటి ఇబ్బందులు తొలగిపోయి మోషన్ ఫ్రీగా అవుతుంది.
ముఖ్యంగా నల్ల నువ్వులను(Sesame) తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో రక్తాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. కేవలం లోపలి ఆరోగ్యానికే కాకుండా చర్మానికి మంచి నిగారింపును ఇవ్వడానికి, జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి.
సాధారణంగా మనకు మార్కెట్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని రెండు రకాలు కనిపిస్తుంటాయి. అయితే వీటి ప్రాసెసింగ్, పోషకాల విషయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. తెల్ల నువ్వులపైన ఉండే పొట్టును తీసేసి అమ్ముతారు. కాబట్టి ఇవి కొద్దిగా కమ్మని రుచిని, తీపిదనాన్ని కలిగి ఉంటాయి.వీటిని బేకరీ వంటకాల్లో, స్వీట్లలో ఎక్కువగా వాడతారు.
అదే నల్ల నువ్వులైతే పొట్టు తీయకుండా అలాగే ఉంచుతారు కాబట్టి ఇవి కాస్త చేదుగా, బలమైన సువాసనతో ఉంటాయి. పొట్టు ఉండటం వల్లే నల్ల నువ్వులలో కాల్షియం, ఐరన్ , యాంటీఆక్సిడెంట్ల శాతం తెల్ల వాటికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఆయుర్వేద ఔషధాలలో, జుట్టు సంరక్షణలో , లడ్డూల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
పోషక విలువలున్న ఈ గింజలను రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలనే అవగాహన కూడా ఉండాలి. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు, అంటే సుమారు 10 నుంచి 15 గ్రాముల వరకూ వీటిని తీసుకోవచ్చు. అయితే వీటిని పచ్చిగా నేరుగా తినడం కంటే కూడా కాస్త దోరగా వేయించి పొడి రూపంలోనో లేదా బెల్లంతో కలిపి లడ్డూలా చేసుకుని తింటే శరీరానికి పోషకాలు చాలా వేగంగా అందుతాయి.
అయితే ఎంత అమృతం లాంటి ఆహారమైనా సరే అతిగా తీసుకుంటే మాత్రం అది కాస్తా వికటించే ప్రమాదం ఉంది. వీటిలో మంచి కొవ్వులతో పాటు క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి లిమిట్ దాటి తింటే బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్ లేదా విరేచనాల వంటి ఇబ్బందులు తలెత్తొచ్చు.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నువ్వులు(Sesame) సహజంగానే బాడీలో వేడిని పెంచుతాయి. అందువల్ల ఎండాకాలంలో కానీ, లేదా ముందే వేడి శరీరం ఉన్నవారు కానీ వీటిని చాలా పరిమితంగానే వాడుకోవాలి. కొందరికి ఇవి తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి అలర్జీలు కూడా రావచ్చు. కాబట్టి వీటిని ఎప్పుడూ తగిన మోతాదులోనే తీసుకుంటూ, రోజంతా మంచిగా నీళ్లు తాగుతూ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
India : తిప్పేసిన స్పిన్నర్లు..భారత్ ఘనవిజయం
