Dharani Portal : ధరణి రహస్యాల గుట్టు విప్పనున్న సిట్.. ప్రజాసమస్యల పరిష్కారమా లేక టార్గెట్‌ కేసీఆర్‌నా?

Dharani Portal : తెలంగాణ రాష్ట్ర ప్రజల భూముల వివరాలు, వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు సేఫ్‌గా ఉందనే డేటా సెక్యూరిటీ అంశాన్ని కూడా సిట్ టీమ్ సీరియస్‌గా విచారించబోతోంది.

Dharani Portal

తెలంగాణలో గతంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్(Dharani Portal) వివాదాలకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పోర్టల్ ప్రారంభమైన సమయం నుంచి దాని నిర్వహణ వరకు జరిగిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా బట్టబయలు చేయడానికి ఉన్నతాధికారి డీజీ చారు సిన్హా ఆధ్వర్యంలో.. ఏడుగురు సభ్యులతో కూడిన ఒక స్పెషల్ ఎంక్వైరీ టీమ్‌ను (SIT) రంగంలోకి దించింది.

ఈ స్పెషల్ టీమ్ పోర్టల్ డిజైన్, టెక్నికల్ అంశాలు , అమలైన విధానాలను మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా స్కాన్ చేయబోతోంది. ధరణి ఏర్పాటు వెనుకున్న టెండర్ల కేటాయింపులో ఏమైనా తప్పుడు పద్ధతులు పాటించారా అలాగే వెండర్ల ఎంపికలో అక్రమాలు, పక్షపాతం జరిగాయా అనే అంశాల గురించి ఈ టీమ్ మెయిన్‌గా దృష్టి పెట్టనుంది.

దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రజల భూముల వివరాలు, వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు సేఫ్‌గా ఉందనే డేటా సెక్యూరిటీ అంశాన్ని కూడా సిట్ టీమ్ సీరియస్‌గా విచారించబోతోంది. పోర్టల్ లోపాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు . ప్రభుత్వానికి ఎక్కడ అయినా రెవెన్యూ నష్టం వాటిల్లిందా అనే కోణంలో కూడా లోతైన ఎంక్వైరీ జరగనుంది.

ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి అనధికార లావాదేవీలు జరిగాయనే విషయాలతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా భూముల మార్పిడి జరిగిందా అనేది కూడా దర్యాప్తు చేస్తారు. అంతేకాదు దీనిలో ఏమైనా విదేశీ ఏజెన్సీలు లేదా కంపెనీల ప్రమేయం ఉందా అనే కోణాన్ని కూడా సిట్ ఆరా తీస్తోంది.

ఇది మెయిన్‌గా మూడు కీలక అంశాల చుట్టూనే విచారణ తిరుగుతోంది. మొదటిది టెండర్లు, వెండర్ల ఎంపిక. దీనిలో ధరణి పోర్టల్(Dharani Portal) డిజైన్ చేయడం, దాన్ని మెయిన్‌టెయిన్ చేయడం కోసం ఫారిన్ కంపెనీలు లేదా నిర్దిష్ట ప్రైవేట్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ ప్రాసెస్‌లో రూల్స్ పాటించకుండా, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారనే ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఒకవేళ సిట్ విచారణలో వారు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై చట్టపరమైన కేసులు పడే ఛాన్స్ ఉంది.

రెండోది డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ ప్రజల భూములకు సంబంధించిన అత్యంత కీలకమైన రికార్డులు, ఆధార్ నంబర్లు, బ్యాంక్ వివరాలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫారిన్ సర్వర్లలో లేదా అన్‌అఫీషియల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి దేశభద్రతకు, ప్రజల ప్రైవేట్ డేటాకు భంగం కలిగించేలా ప్రైవేట్ , విదేశీ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి ఉంటే మాత్రం..దానికి అప్పటి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాల్సి వస్తుంది.

మూడోది రెవెన్యూ నష్టం అలాగే అనధికార లావాదేవీలు. పోర్టల్‌లో ఉన్న లొసుగులను వాడుకుని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉండాల్సిన ల్యాండ్స్‌ను కొందరి పేర్ల మీదకి మార్చేశారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. ఇలాంటి అక్రమ లావాదేవీలు ఏ ప్రభుత్వం హయాంలో జరిగాయి, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది బయటపడితే రాజకీయంగా వారికి పెద్ద దెబ్బే అవుతుంది.

నిజానికి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం వెనుక ఈ రాజకీయ వ్యూహం కూడా ఉంది. ధరణి(Dharani Portal) అనేది కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది తెలిసిన విషయమే. అందులో ఏ చిన్న తప్పు లేదా అక్రమం జరిగినట్లు రుజువైనా సరే, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేయడానికి ఒక పెద్ద అస్త్రం దొరికినట్లే అవుతుంది.

Dharani Portal

కాగా ఇటు సిట్ ఎంక్వైరీ పూర్తి అయ్యాక క్లియర్ కట్ ఆధారాలతో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే విచారణ మధ్యలో కూడా ఇంటరిమ్ రిపోర్టులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ సిట్ ఎంక్వైరీ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Age Limit : చట్ట సభలకు పోటీ చేసే వయసు మారుస్తారా ?..25 నుంచి 21ఏళ్లకు తగ్గిస్తారా?

Exit mobile version