Blood Moon
ఆగస్టు 27 అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతమైన ఖగోళ వింత ఆవిష్కృతం కాబోతోంది. చల్లని వెన్నెల కురిపించే చందమామ ఒక్కసారిగా డార్క్ రెడ్ కలర్‌లోకి మారి రాగి వర్ణంలో మెరవనుంది. ఖగోళ ప్రేమికులను థ్రిల్ చేయడానికి వస్తున్న ఈ అరుదైన పాక్షిక చంద్రగ్రహణం టైమ్‌లో.. భూమి దట్టమైన నీడ మూన్‌ను దాదాపు పూర్తిగా కప్పేయనుంది. కొన్ని గంటల పాటు నింగిలో ఆకట్టుకునే ఈ వింతను శాస్త్రవేత్తలు బ్లడ్ మూన్ అని పిలుస్తున్నారు.
ఈ గ్రహణం టైమ్‌లో చంద్రుని ఉపరితలంలో ఏకంగా 96.2 శాతం భాగాన్ని భూమి దట్టమైన నీడ కప్పేస్తుంది. కేవలం 4 శాతం భాగం మాత్రమే డైరెక్టుగా వెలుగుతుంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి భూమి ఒకే సరళరేఖపైకి రావడం వల్ల ఇది జరుగుతుంది. సాధారణంగా సూర్యకాంతిలోని బ్లూ కలర్ కిరణాలు భూమి అట్మాస్ఫియర్‌లోనే ఆగిపోతాయి.
కానీ ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కిరణాలు భూమి వాతావరణాన్ని చీల్చుకుంటూ వంగి ప్రయాణించి చంద్రుడిని తాకుతాయి. ఆ కిరణాల వల్లే మూన్ బ్లాక్‌గా మారకుండా డార్క్ రెడ్ కలర్‌లోకి మారుతుంది.
పాక్షిక గ్రహణమైనా కూడా సుమారు 96 శాతం భాగం భూమి నీడలోకి వెళ్లడం వల్ల చంద్రుడి ఎక్కువ భాగం రక్తం రంగులోకి మారి, చిన్న అంచు మాత్రమే బ్రైట్‌గా మెరుస్తుంది. వరల్డ్ వైడ్‌గా సుమారు 330 కోట్ల మంది దీనిని వీక్షించొచ్చు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని ప్రజలకు ఇది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. లాస్ ఏంజిల్స్, పోర్ట్‌ల్యాండ్ వంటి నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఇది దర్శనమిస్తుంది.
అయితే ఈ అద్భుతాన్ని డైరెక్టుగా చూసే అవకాశం భారతీయులకు లేదు. గ్రహణం జరిగే టైమ్‌లో మన దగ్గర పగటి సమయం కావడం వల్ల భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్ దేశాల్లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. మన భారత కాలమానం (IST) ప్రకారం ఆగస్టు 28 వతేదీన ఉదయం 06:53 గంటలకు గ్రహణం ప్రారంభం అయి, 08:03కి పాక్షిక గ్రహణం మొదలవుతుంది. ఆ తర్వాత ఉదయం 09:43 గంటలకు గ్రహణం ఉచ్ఛదశకు చేరుకుని, మధ్యాహ్నం 12:31 గంటలకు పూర్తవుతుంది.
అయితే ఈ గ్రహణం డైరెక్టుగా కనిపించకపోయినా నాసా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, NASA+ యాప్ ద్వారా దీనిని ఫ్రీగా హెచ్‌డీ లైవ్‌లోనే చూడొచ్చు. అలాగే timeanddate.com, వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ సైట్లు కూడా ఈ గ్రహణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే #LunarEclipse లేదా #BloodMoon హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా నెటిజన్లు షేర్ చేసే హెచ్‌డీ ఫోటోలు, వీడియోలను కూడా క్షణాల్లోనే చూడొచ్చు.
