India ,Nepal
రెండు పొరుగు దేశాల మధ్య శతాబ్దాలుగా సాగుతున్న రోటీ-బేటీ బంధంలో.. ఒక్క మాట ఎలాంటి భూకంపాన్ని సృష్టించగలదో.. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన ఆ ఒక్క తాజా ప్రకటన ప్రూవ్ చేసింది. పార్లమెంట్ సాక్షిగా బాలేంద్ర షా నోటి వెంట వచ్చిన ఆ మాటలు.. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న భారత్-నేపాల్ సరిహద్దు వివాదానికి ఒక్కసారిగా సరికొత్త మంటలు అంటించినట్లు అయింది.
సభలో కాలాపానీ, లిపులేఖ్ అంశాలపై చర్చిస్తున్న సమయంలో.. కేవలం భారతదేశం మాత్రమే కాదు, నేపాల్ కూడా కొన్ని చోట్ల భారతదేశపు భూభాగంలోకి చొచ్చుకెళ్లిందన్న అర్థం వచ్చేలా బాలేంద్ర షా మాట్లాడటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను దుమారాన్ని రేపింది.
ఒక దేశ ప్రధాని స్థాయి నేత, అదీ వ్యూహాత్మకంగా.. అత్యంత సున్నితమైన సరిహద్దుల గురించి ఇలా వివాదాస్పద కామెంట్లు చేయడం కేవలం పొలిటికల్ ప్రకటనగా మిగిలిపోలేదు. అది రెండు దేశాల చరిత్రను, జాతీయ గౌరవాన్ని, అంతర్గత రాజకీయ లెక్కలను ఒకేసారిగా రచ్చ కీడ్చింది. దీనివల్ల ఈ వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ దాటి, భారత విదేశాంగ శాఖతో పాటు గ్లోబల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
నిజానికి భారతదేశం, నేపాల్ (India,Nepal)దేశాల మధ్య నడుస్తున్న ఈ భూభాగాల వివాదం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. దీని మూలాలు సుమారు రెండు శతాబ్దాల క్రితం, అంటే బ్రిటిష్ కాలం నాటి 1816 నాటి సుగౌలి ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా వంటి ప్రాంతాలపై ఇరు దేశాలూ వేర్వేరుగా తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ ప్రాంతాలన్ని కూడా తమ చారిత్రక భూభాగాలని నేపాల్ గట్టిగా వాదిస్తుంటే, చారిత్రక పత్రాలు, పరిపాలనా వాస్తవాలు , భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఆ భూములన్నీ ఎప్పటి నుంచో తమ నియంత్రణలోనే ఉన్నాయంటూ భారత్ క్లారిటీ ఇస్తోంది.
అయితే నిజానికి లిపులేఖ్ అనేది కేవలం ఒక పర్వత మార్గం మాత్రమే కాదు, అది భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన దారి అని చెప్పాలి. మన హిందువుల పవిత్ర కైలాష్-మానససరోవర్ యాత్రకు ఈ రూట్‌ను భారత్ వాడుకోవడంతో పాటు, చైనా సరిహద్దులకు ఆనుకుని ఉండటం వల్ల రక్షణ పరంగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2020లో నేపాల్ ప్రభుత్వం ఈ వివాదాస్పద ప్రాంతాలను తమ దేశ కొత్త అధికారిక మ్యాప్‌లో చేర్చి, ఏకంగా రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రెండు దేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అప్పటి నుంచి ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాకుండానే అలా నలుగుతూ వస్తోంది. అయితే తాజాగా బాలేంద్ర షా వ్యాఖ్యలు నిద్రపోతున్న సింహాన్ని గిల్లి లేపినట్లుగా అయి ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందనే అర్థం వచ్చేలా బాలేంద్ర షా మాట్లాడటంతో నేపాల్ ప్రతిపక్షాలు ఒక్కసారిగా మండిపడ్డాయి.
దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టేలా ప్రధాని బాలేంద్ర షా ఎలా మాట్లాడతారని, వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన నేపాల్ విదేశాంగ శాఖ .. రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది.
దాస్‌గజా ప్రాంతంలో నదీ మార్గాలు మారడం వల్ల వచ్చిన ఒక చిన్న టెక్నికల్ సమస్యను ప్రధాని అలా ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చింది. నదులు తమ దిశను మార్చుకున్నప్పుడు సరిహద్దు భూముల విషయంలో ఇలాంటి గందరగోళం రావడం సహజమేనని ఒక భౌగోళిక వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని చేసింది.
అయితే అంతర్జాతీయ దౌత్యంలో ఇలాంటి వివరణలేవీ కూడా నష్టాన్ని పూర్తిగా పూడ్చలేవు. ఎందుకంటే ఈ వివాదం వల్ల భారత్‌కు వెంటనే ఎలాంటి ఆర్థిక నష్టం రాకపోయినా, వ్యూహాత్మకంగా , రక్షణ పరంగా ఎదురయ్యే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.
లిపులేఖ్ వంటి సున్నిత ప్రాంతాలపై అనిశ్చితి పెరిగితే మాత్రం.. సరిహద్దు రక్షణ కోసం భారత్ అదనపు సైనిక బలగాలను, నిఘాను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, శతాబ్దాలుగా ఎలాంటి ఆంక్షలు లేని తెరిచిన సరిహద్దులు, స్వేచ్ఛా వాణిజ్యం, రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న బంధుత్వాలు, యాత్రలకు ఇలాంటి ఉద్రిక్తతల వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రస్తుతానికి బాలేంద్ర షా వ్యాఖ్యల వ్యవహారం సైనిక ఘర్షణల వరకు వెళ్లే అవకాశం లేకపోయినా సరే, రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు మాత్రం చాలా వాడివేడిగా సాగడం గ్యారంటీ. భారత్,నేపాల్ (India,Nepal) దేశాల సాంకేతిక కమిటీలు, సరిహద్దు నిపుణులు పాత మ్యాప్‌లను, చారిత్రక ఒప్పందాలను మళ్లీ తవ్వి తీయాల్సి రావొచ్చు.
రాజకీయాల్లో పొరపాటునో, పూర్తి అవగాహన లేకో చేసే కఠినమైన వ్యాఖ్యలు ఎలాంటి క్లిష్ట పరిస్థితులకు దారితీస్తాయో ఈ ఘట్టం నిరూపించనుంది. ఇంకా చెప్పాలంటే భారత్-నేపాల్ సరిహద్దు వివాదం దశాబ్దాల నాటి పాతదే కావచ్చు, కానీ ప్రతి కొత్త ప్రకటన రెండు దేశాల మధ్య చిచ్చు రేపేలా కనిపిస్తోంది. ఈ సున్నితమైన దౌత్య పరీక్షలో రెండు దేశాలు ఎంత పరిణతితో వ్యవహరిస్తాయో, ఎలాంటి శాంతియుత పరిష్కారం వైపు వెళ్తాయో చూడాలి.
Virat Kohli:ఆర్సీబీ గుండె చప్పుడు విరాట్ కోహ్లీ..ఐపీఎల్ అగ్రెషన్‌కు కేరాఫ్ అడ్రస్
